Advertisement

ఏపీ తలుపుతట్టిన మరో 'బంగారు' అవకాశం.. చంద్రబాబు సొంత జిల్లాలో భారీ పసిడి నిక్షేపాలు!

Another Golden chance for AP Huge gold deposits in CM Chandrababu Naidu home district
  • చిగురుగుంట-బి.సానత్తం గనుల్లో 12,500 కిలోల బంగారం ఉన్నట్లు అంచనా
  • ఈ-వేలంలో పాల్గొనడానికి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ సన్నాహాలు
  • వేలం లేకుండానే గనుల్ని కేటాయించాలని కేంద్రాన్ని కోరేందుకు ప్రభుత్వం కసరత్తు
  • గతంలో నిలిచిపోయిన గనుల తవ్వకాలను పునఃప్రారంభించాలని సీఎం ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ 'బంగారు' అవకాశం తలుపుతట్టింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖనిజ సంపద వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభమైన నేపథ్యంలో, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో భారీ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ గనులను దక్కించుకుని, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారానే బంగారం వెలికితీయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం చిగురుగుంట-బి.సానత్తం ప్రాంతంలోని గనుల్లో సుమారు 22 లక్షల టన్నుల బంగారు ఖనిజం ఉన్నట్లు అంచనా. నిపుణుల లెక్కల ప్రకారం.. ఒక టన్ను ఖనిజాన్ని శుద్ధి చేస్తే 5.64 గ్రాముల బంగారం లభించే అవకాశం ఉంది. ఈ లెక్కన మొత్తం ఖనిజం నుంచి ఏకంగా 12,500 కిలోల (12.5 టన్నుల) బంగారం వెలికితీయవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ గనులను ఏపీఎండీసీకే దక్కేలా చూడాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏపీఎండీసీ ఈ గనుల కోసం నిర్వహించే ఈ-వేలంలో పాల్గొనడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం రూ.37 కోట్ల బ్యాంకు గ్యారెంటీని కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. జులై నెలాఖరులోగా బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది.

మరోవైపు వేలం ప్రక్రియ లేకుండానే ఈ గనులను నేరుగా ఏపీఎండీసీకి కేటాయించాలని కేంద్రాన్ని కోరేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇటీవల తెలంగాణలోని సింగరేణికి రెండు బొగ్గు గనులను, ఒడిశాలో బాక్సైట్ లీజును కేంద్రం వేలం లేకుండానే కేటాయించింది. ఇదే పద్ధతిలో తమకు కూడా చిగురుగుంట గనులతో పాటు రామగిరి, రొద్దం, జవకుల గనులను కేటాయించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించనుంది.

గతంలో ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిగినా, పెరిగిన రవాణా ఖర్చులు, అప్పట్లో బంగారం ధరలు తక్కువగా ఉండటంతో 2000 సంవత్సరంలో గనులను మూసివేశారు. 2018లో జరిగిన వేలంలో ఎన్‌ఎండీసీ గనులను దక్కించుకున్నప్పటికీ, న్యాయపరమైన చిక్కులతో ముందుకు సాగలేకపోయింది. చివరికి ఎన్‌ఎండీసీ వెనక్కి తగ్గడంతో ఇప్పుడు ఈ గనులను దక్కించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. వేలంలో గనులు దక్కితే, మరో సంస్థతో కలిసి తవ్వకాలు చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh Gold Mines
Chittoor Gold Deposits
APMDC
Chigurugunta Gold Mines
Gold Mining in Andhra Pradesh

More Telugu News