ఎల్-నినో కారణంగా తీవ్ర నీటి కొరత.. మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ఆదేశాలు
- గోదావరి, కృష్ణా డెల్టాల ఇరిగేషన్ అధికారులతో నిమ్మల ఉన్నత స్థాయి సమీక్ష
- మెరక ప్రాంత రైతులు కూడా ఆరుతడి పంటలకే ప్రాధాన్యతనివ్వాలని సూచన
- పులిచింతల, పట్టిసీమ నీళ్లను తాగునీటి అవసరాలకు భద్రపరుచుకోవాలన్న మంత్రి
రాష్ట్రంలో రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పరిపూర్ణ సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. గోదావరి, కృష్ణా డెల్టాల ఇరిగేషన్ సీఈలు, ఎస్ఈలతో ఈరోజు నిర్వహించిన ఉన్నత స్థాయి టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఎల్-నినో ప్రభావం, క్లిష్టమైన నీటి కొరత దృష్ట్యా ఇరిగేషన్ శాఖలోని పైస్థాయి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరి సెలవులను రద్దు చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.
పుష్కర కాలువ, ఏలేరు వ్యవస్థ ద్వారా తూర్పుగోదావరి, కాకినాడ, విశాఖ జిల్లాల్లో దాదాపు 55 లక్షల మందికి తాగునీరు అందించాల్సి ఉందని... అందుకే ఈ నీటిని తాగునీటికి, ఆరుతడి పంటలకే వినియోగించాలని సూచించారు. సీలేరు జలాలను గోదావరి డెల్టా ఖరీఫ్ అవసరాల కోసం వాడుతున్నామని, మెరక ప్రాంత రైతులు కూడా ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే గోదావరి ప్రధాన కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూస్తూ, పొలవరం కుడి కాలువ నీరు వృథా కాకుండా కృష్ణా డెల్టాకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఇక కృష్ణా డెల్టా పరిధిలో నాగార్జున సాగర్ నిండకుండానే వరి సాగు చేస్తే ఆ ప్రాంత రైతులు పంట నష్టపోయే ప్రమాదం ఉందని మంత్రి హెచ్చరించారు. ఈ సీజన్‌లో సాగర్‌కు నీళ్లు రాకపోతే 2027 జూన్ వరకు పులిచింతల, పట్టిసీమ నీళ్లను తాగునీటి అవసరాలకే భద్రపరచుకోవాలని స్పష్టం చేశారు. పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించేందుకు 10 జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.