Advertisement

రిటైరైన వారు మళ్లీ విధుల్లోకి.. శాప్‌పై ఏపీ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు

AP Government issues new orders for SAAP as retired employees return to duty
  • ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు
  • రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు
  • ఇప్పటికే రిటైరైన 8 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి స్వీకరణ
  • ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల ఉద్యోగులకు వర్తిస్తున్న కొత్త నిబంధన
  • విధుల్లో లేని కాలానికి జీతభత్యాలు ఉండవని స్పష్టం చేసిన ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచే వర్తింపజేస్తుండటంతో ఇటీవల 60 ఏళ్లకు పదవీ విరమణ చేసిన ఎనిమిది మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు శాప్ ప్రకటించింది.

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమ పదవీ విరమణ వయసును కూడా 62 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ), కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేసే ఉద్యోగులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం 2022లో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచినప్పటికీ, ఈ సంస్థలకు మాత్రం వర్తింపజేయలేదు. దీంతో కొందరు ఉద్యోగులు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రస్తుత ప్రభుత్వం, ఇటీవల పీఎస్‌యూలు, కార్పొరేషన్లలోని ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని షెడ్యూల్-9, షెడ్యూల్-10 పరిధిలోకి వచ్చే సంస్థలకు ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల ఖజానాపై పడే ఆర్థిక భారంతో పాటు ఇతర అంశాలపై ప్రభుత్వం క్షుణ్ణంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంది.

ఈ ఉత్తర్వుల ప్రకారం ఇప్పటికే 60 ఏళ్లకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నారు. అయితే, వారు ఉద్యోగంలో లేని కాలానికి ఎలాంటి జీతభత్యాలు చెల్లించరు. 62 ఏళ్లు నిండే వరకు వారిని రెగ్యులర్ ఉద్యోగులుగానే పరిగణిస్తారు. ఇటీవల ఏపీ ఆర్కైవ్స్‌ విశ్రాంత డైరెక్టర్‌ వి.రంగరాజ్‌ను ఇదే విధానంలో తిరిగి విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం, ఇప్పుడు తాజాగా శాప్ ఉద్యోగులకు కూడా ఈ ప్రయోజనాన్ని వర్తింపజేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో శాప్ ఉద్యోగులకు ఊరట లభించింది.
Advertisement
Sports Authority of Andhra Pradesh
AP Government
SAAP retirement age hike
Andhra Pradesh PSU employee news
AP Reorganization Act 2014
Andhra Pradesh government job updates

More Telugu News