Advertisement

విద్యార్థులతో చంద్రబాబు, లోకేశ్ మధ్యాహ్న భోజనం.. కీలక సూచన చేసిన సీఎం

Chandrababu Naidu and Nara Lokesh have midday meal with students and CM makes key suggestion
  • రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్... హాజరైన చంద్రబాబు, లోకేశ్
  • విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం
  • మధ్యాహ్న భోజనం నాణ్యతను విద్యార్థులను అడిగి స్వయంగా తెలుసుకున్న వైనం
  • పోషకాహార లోపం నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచన
  • ఉదయం రాగి మాల్ట్, మధ్యాహ్నం చిక్కీ ఇస్తున్నామన్న మంత్రి లోకేశ్
  • విద్యార్థుల కోరిక మేరకు వారితో కలిసి ఫొటోలు దిగిన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం) కార్యక్రమం అనంతరం వారు స్థానిక పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనశాలలో కూర్చుని వారితో ముచ్చటించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న ఆహారం నాణ్యత గురించి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆరా తీశారు. "భోజనం ఎలా ఉంది? రుచిగా ఉందా?" అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ, విద్యార్థుల్లో విటమిన్ లోపాలను నివారించేందుకు పోషకాల కూడిన ఆహారాన్ని అందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యమే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి సూచనలపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ, ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశగా చర్యలు తీసుకుంటోందని వివరించారు. విద్యార్థులందరికీ కంటి పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. అల్పాహారంగా ఏమైనా అందిస్తున్నారా అని సీఎం అడగగా, ఉదయం పూట రాగి మాల్ట్, మధ్యాహ్న భోజనంతో పాటు చిక్కీ కూడా అందిస్తున్నామని లోకేశ్ బదులిచ్చారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచన చేశారు. విద్యార్థులు ఇంటికి వెళ్లే సమయంలో స్నాక్‌గా చిక్కీలు అందించే ఏర్పాటు చేస్తే మరింత బాగుంటుందని సూచించారు.

భోజనం అనంతరం పలువురు విద్యార్థులు ముఖ్యమంత్రితో ఫొటోలు దిగాలని ఉందని కోరారు. వారి అభ్యర్థనకు వెంటనే స్పందించిన చంద్రబాబు, విద్యార్థులతో ప్రత్యేకంగా ఫొటోలు దిగి వారిని ఆనందపరిచారు. సీఎం, మంత్రి నేరుగా తమతో కలిసి భోజనం చేయడం, ఆప్యాయంగా పలకరించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
Advertisement
Chandrababu Naidu
Nara Lokesh
Midday Meal Scheme
Rampachodavaram Mega PTM
Andhra Pradesh Education
Student Nutrition

More Telugu News