Advertisement

మంగళగిరి కార్యాలయం వద్ద కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన పవన్ కల్యాణ్

Pawan Kalyan welcomes Kumki elephants at Mangalagiri camp office
  • విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో పంట పొలాలను నాశనం చేస్తున్న ఏనుగులు
  • పలమనేరు నుంచి పార్వతీపురం జిల్లాకు బయలుదేరిన రెండు కుంకీ ఏనుగులు
  • పూలమాలలు వేసి స్వాగతం పలికిన పవన్ కల్యాణ్

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులను భయాందోళనలకు గురిచేస్తున్న అడవి ఏనుగుల గుంపును అదుపు చేసేందుకు అటవీశాఖ కుంకీ ఏనుగులను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు బయలుదేరిన 'జయంత్', 'అభిమన్యు' అనే రెండు కుంకీ ఏనుగులకు మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా స్వాగతం పలికారు.


కుంకీ ఏనుగులకు పూలమాలలు వేసి, స్వయంగా చెరుకు గెడలను ఆహారంగా తినిపించిన పవన్ కల్యాణ్... వాటికి వీడ్కోలు పలికారు. ఈ రెండు కుంకీ ఏనుగులను మొదట పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలించి, అక్కడి నుంచి అడవి ఏనుగులు తిరుగుతున్న ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని నియంత్రించేందుకు అటవీ అధికారులు పక్కా ప్రణాళిక రూపకల్పన చేశారు. జయంత్, అభిమన్యులకు గతంలో కూడా ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం ఉండటంతో అధికారులు మొదట వీటినే రంగంలోకి దించారు.


ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఒడిశా సరిహద్దుల నుంచి ఏనుగులు రాష్ట్రంలోకి వచ్చి పంటలను నాశనం చేస్తున్నందున, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సమన్వయం చేసుకోవాలని సూచించారు. అవసరమైతే ఒడిశా నుంచి కూడా మరికొన్ని కుంకీ ఏనుగులను రప్పించి ఏనుగుల దాడులకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఆలోగా మన వద్ద ఉన్న కుంకీలతోనే జనవాసాల్లోకి వచ్చిన ఏనుగులను వీలైనంత త్వరగా తిరిగి అడవుల్లోకి మళ్లించేలా చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

Advertisement
Pawan Kalyan
Kumki elephants
Mangalagiri camp office
Parvathipuram Manyam
Andhra Pradesh Forest Department
Wild elephant menace

More Telugu News