నేపాల్ సరిహద్దులో ఉగ్ర కుట్ర భగ్నం: ‘వారిస్ పంజాబ్ దే’ సభ్యుడు, యూఎస్ పౌరుడి అరెస్ట్!
- నేపాల్ సరిహద్దుల నుంచి ఇండియాలోకి ప్రవేశించేందుకు యత్నం
- విక్రమ్‌జిత్ సింగ్, మన్వీర్ సింగ్ ధిల్లాన్ అరెస్ట్
- వీరిద్దరిపై పంజాబ్‌లో ఇప్పటికే కేసులు
ఉత్తరప్రదేశ్ - నేపాల్ సరిహద్దు వద్ద భారత భద్రతా దళాలు భారీ ఆపరేషన్ చేపట్టి ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి. ఖలిస్థాన్ అనుకూల సంస్థ 'వారిస్ పంజాబ్ దే'కు చెందిన మోస్ట్ వాంటెడ్ సభ్యుడితో పాటు, ఆ సంస్థతో సంబంధాలున్న ఒక అమెరికన్ పౌరుడిని సరిహద్దు వద్ద రక్షణ దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా పరిధిలో ఉన్న రూపైడీహా సరిహద్దు పోస్ట్ వద్ద సశస్త్ర సీమా బల్, ఉత్తరప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. అరెస్ట్ అయిన వారిలో మొదటి వ్యక్తి విక్రమ్‌జిత్ సింగ్ కాగా, ఈయన 2023లో పంజాబ్‌లోని అజ్నాలా పోలీస్ స్టేషన్‌పై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉంటూ పరారీలో ఉన్నాడు. ఇక రెండో వ్యక్తి మన్వీర్ సింగ్ ధిల్లాన్ పంజాబ్‌లోని మోగా ప్రాంతానికి చెందినవాడైనప్పటికీ అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నాడు. భారత నిఘా వర్గాల కంటపడకుండా వీసా లేకుండా నేపాల్ ద్వారా ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఇతడు యత్నించాడు.
వీరిద్దరినీ అక్రమంగా సరిహద్దు దాటించి భారతదేశంలోకి తీసుకెళ్లేందుకు సహకరించిన రూపైడీహాకు చెందిన సురేశ్ కుమార్ పాఠక్, దిలీప్ ఉపాధ్యాయ్‌లతో పాటు వాహన డ్రైవర్ రాహుల్ కుమార్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ వ్యవహారంపై బహ్రైచ్ ఎస్పీ విశ్వజీత్ శ్రీవాత్సవ మాట్లాడుతూ... వీసా, సరైన ప్రయాణ పత్రాలు లేకుండా సరిహద్దు దాటుతుండగా అనుమానంతో తనిఖీ చేయగా వీరి అసలు రంగు బయటపడిందని తెలిపారు. వీరిద్దరిపై పంజాబ్‌లో వేర్వేరు కేసులు నమోదై ఉన్నాయని, ప్రస్తుతం ఈ ఐదుగురిపై కేసు నమోదు చేసి కేంద్ర నిఘా వర్గాలు లోతుగా విచారిస్తున్నాయని వెల్లడించారు. నటుడు, యాక్టివిస్ట్ దీప్ సిద్ధూ 2021లో స్థాపించిన 'వారిస్ పంజాబ్ దే' సంస్థ, తదనంతర పరిణామాల్లో ఖలిస్థాన్ అనుకూల కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారడంతో సరిహద్దుల వద్ద భద్రతా దళాలు గస్తీని మరింత తీవ్రతరం చేశాయి.