తిరుమలపై ఆంజనేయస్వామి విగ్రహ చోరీ కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు.. మంత్రి ఆనం అభినందనలు
- తిరుమల ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద విగ్రహ అపహరణ
- 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు
- దేవాలయాల వద్ద భద్రతను పటిష్ఠం చేయాలని ఆనం ఆదేశాలు
తిరుమల ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద చోటుచేసుకున్న ఆంజనేయస్వామి విగ్రహ అపహరణ కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించిన తిరుపతి జిల్లా పోలీసులను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రశంసించారు. పక్కా ప్రణాళికతో వేగవంతమైన దర్యాప్తు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు, స్వామివారి విగ్రహాన్ని సురక్షితంగా స్వాధీనం చేసుకోవడం పోలీసుల సమర్థతకు, అంకితభావానికి నిదర్శనమని ఆయన కొనియాడారు.
తిరుమల వంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి అన్నారు. తిరుమలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన దేవాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లను తక్షణమే పటిష్ఠం చేయాలని సంబంధిత దేవాదాయ, పోలీస్ అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణాల్లో సీసీటీవీ నిఘాను నిరంతరం పర్యవేక్షించాలని, భద్రతా సిబ్బంది గస్తీని పెంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు.
దేవతా విగ్రహాలను అపహరించడం లేదా ఆలయ ఆస్తులు, సెంటిమెంట్లతో ఆడుకునే దుశ్చర్యలకు పాల్పడే వారిపై కూటమి ప్రభుత్వం అత్యంత కఠినమైన వైఖరిని అవలంబిస్తుందని మంత్రి హెచ్చరించారు. కోట్ల మంది భక్తుల నమ్మకాలకు, భావోద్వేగాలకు భంగం కలిగించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తేల్చిచెప్పారు. భవిష్యత్తులో ఏ పుణ్యక్షేత్రంలోనూ ఇలాంటి అపచారాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.