Advertisement

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. భోగాపురం ఎయిర్‌పోర్ట్, పెట్టుబడులపై కీలక చర్చ

AP Cabinet meeting today key discussions on Bhogapuram Airport and investments
  • సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 10.30 గంటలకు కేబినెట్ సమావేశం
  • వివిధ కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కేబినెట్
  • భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం ఏర్పాట్లపై సమీక్ష
  • కొత్త పెట్టుబడులు, భూ కేటాయింపులపై కీలక చర్చ
ఈరోజు ఉదయం 10:30 గంటలకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి నేరుగా ఈ భేటీకి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకోనుంది.

ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించనుంది. ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో, ఇందుకు సంబంధించిన సన్నాహాలు, భద్రతా చర్యలను ప్రభుత్వం సమీక్షించనుంది. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధిలో ఈ ప్రాజెక్టు అత్యంత కీలకం కావడంతో ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఈ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ‘మీభూమి - బ్లాక్‌చెయిన్’ అనే సరికొత్త వ్యవస్థను ప్రారంభించనున్నారు. భూ రికార్డుల్లో పారదర్శకతను పెంపొందించడంతో పాటు, రికార్డుల తారుమారు (టాంపరింగ్), అక్రమాలను అరికట్టడానికి అత్యాధునిక బ్లాక్‌చెయిన్ సాంకేతికతను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. తొలి దశలో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

వీటితో పాటు రాష్ట్రానికి నూతన పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలకు భూ కేటాయింపులు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో యూఏఈతో సహకారం వంటి అంశాలు అజెండాలో ప్రధానంగా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ పథకాల అమలు, వివిధ శాఖల పనితీరు సమీక్షతో పాటు, కొందరు మంత్రులకు అదనపు బాధ్యతలు అప్పగించే అంశంపై కూడా చర్చ సాగే అవకాశం ఉంది. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అసత్య ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టేలా అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.                                
Advertisement
Chandrababu Naidu
AP Cabinet Meeting
Bhogapuram International Airport
Meebhoomi Blockchain Technology
Andhra Pradesh Investments
Andhra Pradesh Land Records

More Telugu News