Advertisement

ప్రభుత్వ బడి నుంచి లూనార్ మిషన్‌కు.. ఏపీ విద్యార్థినిపై మంత్రి లోకేశ్ ప్రశంసలు

From government school to lunar mission Minister Lokesh praises AP student
  • గ్లోబల్ లూనార్ మిషన్‌కు ఏపీ విద్యార్థిని ఎంపిక
  • ధవళేశ్వరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కందుల జెస్సీ
  • మిషన్ శక్తిశాట్‌ కార్యక్రమంలో శాస్త్రవేత్తలతో పనిచేయనున్న వైనం
  • విద్యార్థిని జెస్సీని అభినందించిన మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అరుదైన అంతర్జాతీయ ఘనతను సొంతం చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కందుల జెస్సీ, ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్ ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ అయిన 'మిషన్ శక్తిశాట్‌'కు ఎంపికయ్యారు.

ఈ మిషన్‌లో భాగంగా జెస్సీ శాటిలైట్ రూపకల్పనలో అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో కలిసి పనిచేయనున్నారు. ఈ శాటిలైట్‌ను అక్టోబర్ 11న శ్రీహరికోటలోని 'షార్' కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అంతరిక్ష ప్రయోగంలో భాగస్వామి కావడం రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది.

ఈ విజయంపై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. జెస్సీని అభినందిస్తూ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రశంసలు కురిపించారు. "విద్యా రంగంపై మేం ఎందుకు ఇంతగా పెట్టుబడి పెడుతున్నామో అప్పుడప్పుడు ఇలాంటి కథలు గుర్తుచేస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి అంతర్జాతీయ అంతరిక్ష మిషన్‌కు ఆమె ప్రయాణం, కలలు కనే ప్రతి యువతకు స్ఫూర్తిదాయకం" అని పేర్కొన్నారు.

"జెస్సీ, నువ్వు ఆంధ్రప్రదేశ్‌ గర్వపడేలా చేశావు. చంద్రుడిని, ఆపై శిఖరాలను అందుకోవాలని ఆశిస్తూ నీకు శుభాకాంక్షలు" అంటూ లోకేశ్ తన పోస్టులో అభినందనలు తెలిపారు.
Advertisement
Kandula Jessie
Nara Lokesh
Mission ShaktiSat
Andhra Pradesh Government School Student
Lunar CubeSat Mission
East Godavari Education

More Telugu News