2021 నాటికే పూర్తి కావాల్సిన పోలవరాన్ని వైసీపీ నాశనం చేసింది: నిమ్మల రామానాయుడు
- వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టు తీవ్రంగా నష్టపోయిందన్న నిమ్మల
- నిర్వాసితులను కూడా గత ప్రభుత్వం మోసం చేసిందని విమర్శ
- ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు బాగుపడుతున్నాయని వ్యాఖ్య
2019లో తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని... కానీ గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంస పాలన వల్ల ప్రాజెక్టు తీవ్రంగా నష్టపోయిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు గాడిన పడుతున్నాయని పేర్కొన్నారు. సచివాలయంలో జలవనరుల శాఖపై ఈరోజు ఆయన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కీలకమైన ప్రాజెక్టులు, వాటి తాజా స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు వెల్లడించారు.
2014-19 మధ్యకాలంలో పోలవరం పనులు వేగంగా జరిగి 72 శాతం మేర పూర్తయ్యాయని, అయితే జగన్ 'ఒక్క ఛాన్స్' అంటూ వచ్చి రివర్స్ టెండరింగ్ పేరుతో తీవ్ర నష్టం చేశారని విమర్శించారు. కాంట్రాక్టు ఏజెన్సీలను రద్దు చేయవద్దని ఎంతమంది హెచ్చరించినా వినకుండా, 17 నెలల పాటు పనులను నిలిపివేశారని మండిపడ్డారు. దీని ఫలితంగానే 2020లో వచ్చిన వరదలకు డయాఫ్రమ్‌వాల్ పూర్తిగా దెబ్బతిన్నదని నిపుణులు స్పష్టం చేశారని తెలిపారు. ఆఖరికి పోలవరం నిర్వాసితులను కూడా గత ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు.
ధ్వంసమైన జలవనరుల రంగాన్ని పునర్నిర్మించి పూర్వ స్థితికి తీసుకువస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. 2028 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 36 ప్రధాన ప్రాజెక్టులను ఏ స్థాయిలో పూర్తి చేస్తామనే దానిపై స్పష్టమైన కార్యాచరణను వివరించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు తాగు, సాగు నీటిని సరఫరా చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.