‘‘సారీ నాన్నా.. 50 సార్లు ప్రయత్నించా’’.. కలచివేస్తున్న గోల్డ్‌ మెడలిస్ట్‌ చివరి లేఖ

Anand Kumar Kanpur engineer ends life leaving heartbreaking suicide note for father
  • కాన్పూర్‌లో బీటెక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ ఆత్మహత్య
  • ప్రభుత్వ ఉద్యోగం కోసం 50 ప్రయత్నాలు
  • సూసైడ్‌ నోట్‌లో తండ్రికి క్షమాపణ
  • బీటెక్‌లో రాష్ట్రంలోనే మూడో ర్యాంకు సాధించిన విద్యార్థి 
  • గత కొన్ని నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడి
ప్రతిభ ఉంది. చదువులో అగ్రస్థానం సాధించాడు. గవర్నర్‌ చేతుల మీదుగా గోల్డ్‌ మెడల్‌ అందుకున్నాడు. అయినా ప్రభుత్వ ఉద్యోగం మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. వరుస వైఫల్యాలను తట్టుకోలేక చివరకు ఓ యువ ఇంజినీర్‌ తీసుకున్న నిర్ణయం ఉత్తరప్రదేశ్‌లో విషాదాన్ని మిగిల్చింది. అతడు రాసిన ఐదు లైన్ల సూసైడ్‌ నోట్‌ ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన 23 ఏళ్ల ఆనంద్‌ కుమార్‌ బీటెక్‌ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నాడు. 2024లో కాన్పూర్‌లోని ప్రణ్‌వీర్‌ సింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (పీఎస్‌ఐటీ)లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. రాష్ట్రవ్యాప్తంగా మూడో ర్యాంకు దక్కించుకున్నాడు. కళాశాల నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ చేతుల మీదుగా స్వర్ణ పతకం అందుకున్నాడు. ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న ఆనంద్‌ భవిష్యత్తుపై కుటుంబ సభ్యులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

గ్రాడ్యుయేషన్‌ పూర్తైన తర్వాత పవర్‌ గ్రిడ్‌లో ఏడాది పాటు అప్రెంటిస్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యాడు. రైల్వే, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, బ్యాంకులు, విద్యాశాఖ నిర్వహించిన నియామక పరీక్షలు సహా దాదాపు 50 పరీక్షలు రాసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ప్రతీసారి నిరాశే ఎదురైంది. వరుస అపజయాలతో గత కొన్ని నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాడని అతడి తండ్రి రాజ్‌కుమార్‌ వెల్లడించారు.

ఈ క్రమంలో కుటుంబ సభ్యులు పెద్ద కుమారుడి వివాహం ఖరారు చేసేందుకు బీహార్‌లోని స్వగ్రామానికి వెళ్లారు. ఆనంద్‌ మాత్రం కాన్పూర్‌లోని గోవింద్‌నగర్‌లో ఉన్న ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. చాలాసేపు తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో ఇంటి పనిమనిషి స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు తలుపులు తెరిచి చూడగా గదిలో ఉరివేసుకున్న స్థితిలో ఆనంద్‌ కనిపించాడు. అక్కడే అతడు రాసిన ఐదు లైన్ల లేఖను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఆ లేఖలో తన తండ్రికి క్షమాపణ చెబుతూ హృదయవిదారకంగా రాశాడు. ‘‘సారీ నాన్నా.. ప్రభుత్వ ఉద్యోగం కోసం దాదాపు 50 సార్లు ప్రయత్నించాను. అయినా విజయం సాధించలేకపోయాను. నన్ను క్షమించండి’’ అని ఇంగ్లిష్‌లో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతలో పెరుగుతున్న ఉద్యోగ ఒత్తిడి, పోటీ పరీక్షల మానసిక భారం మరోసారి చర్చకు దారితీసింది.
Advertisement
Anand Kumar
Kanpur student suicide
Uttar Pradesh gold medalist
Government job exam pressure
PSIT Kanpur engineering student
Anandiben Patel gold medal

More Telugu News