ఉద్ధవ్‌ ఠాక్రేకు భారీ షాక్.. ఆరుగురు ఎంపీలు షిండే వర్గంలో విలీనం

Uddhav Thackeray faces big shock as six MPs merge with Shinde faction
  • ఈ విలీనానికి ఆమోగం తెలిపిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా 
  • లోక్‌సభలో 13కి పెరిగిన షిండే వర్గం బలం
  • పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే ఈ కీలక పరిణామం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి సరిగ్గా రెండు రోజుల ముందు శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు లోక్‌సభలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వర్గానికి చెందిన ఆరుగురు అసమ్మతి ఎంపీలు, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం కావడానికి స్పీకర్ ఓం బిర్లా శనివారం అధికారికంగా ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం ఠాక్రే వర్గానికి రాజకీయంగా తీవ్ర నష్టం చేకూర్చింది.

ఈ పరిణామంతో లోక్‌సభలో ఏక్‌నాథ్ షిండే వర్గం బలం 7 నుంచి 13కి పెరిగింది. అదే సమయంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం బలం కేవలం ముగ్గురు ఎంపీలకే పరిమితమైంది. దీనివల్ల సభలో అధికార ఎన్డీఏ కూటమి బలం 319కి చేరింది. జూలై 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

గత జూన్ నెలలో శివసేన (యూబీటీ)కు చెందిన తొమ్మిది మంది ఎంపీలలో ఆరుగురు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వారు షిండే వర్గంలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తమను షిండే వర్గంలో విలీనం చేయాలని కోరుతూ స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు.

మరోవైపు, పార్టీ ఫిరాయించిన ఆరుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ ఠాక్రే స్పీకర్‌ను కోరారు. అయితే, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ (9 మందిలో 6 మంది) తమకు ఉందని రెబల్ ఎంపీలు వాదించారు. తాజాగా లోక్‌సభ టేబుల్ ఆఫీస్ జారీ చేసిన సర్క్యులర్‌లో, ఆరుగురు ఎంపీల విలీనాన్ని స్పీకర్ గుర్తించినట్లు అధికారికంగా వెల్లడించారు.                                
Advertisement
Uddhav Thackeray
Eknath Shinde
Shiv Sena MP merger
Lok Sabha Speaker Om Birla
Maharashtra Politics
Shiv Sena UBT

More Telugu News