మన సినిమా థియేటర్లే బెటర్ అంట.. కొరియా యువతి ప్రశంసల వెల్లువ

Indian movie theaters are better South Korean woman praises interval system
  • భారతీయ థియేటర్లలో ఇంటర్వెల్ విధానాన్ని మెచ్చుకున్న కొరియన్ మహిళ
  • కొరియాలో సినిమాకు మధ్యలో విరామం ఉండదని వెల్లడి
  • మొదట్లో ఇది తనకు కల్చర్ షాక్‌గా అనిపించిందని వ్యాఖ్య
  • ప్రస్తుతం భారతీయ వ్యవస్థే ఉత్తమమని అభిప్రాయపడిన వైనం
భారతదేశంలో నివసిస్తున్న ఓ దక్షిణ కొరియా మహిళ, మన దేశంలోని సినిమా థియేటర్ల విశిష్టతపై రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా, సినిమాల మధ్యలో ఇచ్చే విరామం విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని, ఇది తమ దేశం కంటే ఎంతో మెరుగైన పద్ధతి అని ఆమె ప్రశంసించారు.

జంగ్ ఏ ఉమ్ అనే ఈ కొరియన్ మహిళ తన కుటుంబంతో కలిసి భారత్‌లో నివసిస్తున్నారు. ఇక్కడి తన అనుభవాలను 'వొన్నీ బ్రదర్స్' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆమె పంచుకుంటారు. తాజాగా 'కొరియా వర్సెస్ ఇండియా మూవీ థియేటర్' పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తమ దేశంలో సినిమా నిడివి ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ, మధ్యలో విరామం లేకుండా నిరంతరాయంగా ప్రదర్శిస్తారని, ఎవరికైనా అత్యవసరమైతే చీకట్లోనే బయటకు వెళ్లాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.

భారత్‌కు వచ్చిన కొత్తలో సినిమా మధ్యలో అకస్మాత్తగా లైట్లు వేసి, ప్రేక్షకులందరూ బయటకు వెళ్లడం చూసి తాను 'కల్చర్ షాక్‌"కు గురయ్యానని ఉమ్ పేర్కొన్నారు. "అయితే ఇప్పుడు మాత్రం భారతీయ సినిమా థియేటర్ల వ్యవస్థే అత్యుత్తమమని నేను భావిస్తున్నాను" అని ఆమె తెలిపారు. వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా, స్నాక్స్ తెచ్చుకోవాలన్న లేదా కాసేపు విశ్రాంతి తీసుకోవాలన్నా ఇక్కడి ఇంటర్వెల్ విధానం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని వివరించారు.

సాధారణంగా భారత్‌లో సినిమాలు రెండు నుంచి మూడు గంటల నిడివి కలిగి ఉంటాయి. కథలో కీలకమైన ఘట్టం వద్ద విరామం ఇవ్వడం ప్రేక్షకుల్లో ఆసక్తిని నిలిపి ఉంచడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఉమ్ పోస్ట్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. భారతీయ సినిమా ప్రదర్శన విధానంలో ఉన్న ఈ సౌలభ్యాన్ని పలువురు నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్న ఉమ్, తరచుగా భారతీయ సంస్కృతిలోని సానుకూల అంశాలను హైలైట్ చేస్తూ వీడియోలు రూపొందిస్తుంటారు.
Advertisement
Jung Ae Um
Indian Movie Theaters
Interval System
South Korean Woman
Wonnie Brothers
Indian Cinema Culture

More Telugu News