తిరుమల వెంకన్న భక్తులకు టోకరా వేస్తున్న టీటీడీ మాజీ ఉద్యోగి అరెస్ట్

Former TTD employee arrested for cheating Tirumala Venkateswara devotees
  • బెంగళూరుకు చెందిన రెండు కుటుంబాల నుంచి రూ.3.20 లక్షలు వసూలు చేసిన నిందితుడు
  • నిందితుడి బ్యాంకు ఖాతాలో ఏడాది కాలంలో రూ. 85 లక్షల లావాదేవీలు జరిగినట్టు గుర్తింపు
  • గతంలోనూ ఇలాంటి మోసానికే పాల్పడి అరెస్ట్ అయినట్టు వెల్లడించిన పోలీసులు
  • నిందితుడి నుంచి రూ. 99 వేల నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం
శ్రీవారి దర్శన టికెట్లు, సేవా టికెట్లు, వసతి గదులు ఇప్పిస్తానని భక్తులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న టీటీడీ మాజీ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన రెండు కుటుంబాల నుంచి రూ. 3.20 లక్షలు వసూలు చేశాడన్న ఆరోపణలపై తిరుమల టూ టౌన్ పోలీసులు మంగళవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతికి చెందిన టి. అరుణ్ కుమార్‌ (26) గతంలో టీటీడీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసేవాడు. విధుల్లో అక్రమాలకు పాల్పడటంతో అధికారులు అతడిని తొలగించారు. అయినప్పటికీ, టీటీడీలో తనకు పలుకుబడి ఉందని నమ్మిస్తూ భక్తుల నుంచి నగదు వసూలు చేయడం మొదలుపెట్టాడు. 2023లో కూడా ఇటువంటి మోసం కేసులోనే అతను అరెస్టయ్యాడని, అయినా తన ప్రవర్తనలో మార్పు రాలేదని పోలీసులు వెల్లడించారు.

తిరుమల టూ టౌన్ సీఐ శ్రీరాములు మాట్లాడుతూ.. నిందితుడి బ్యాంకు ఖాతాలను పరిశీలించగా, గత ఏడాది కాలంలో సుమారు రూ. 85 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు. నిందితుడి నుంచి రూ. 99,000 నగదు, ఒక మొబైల్ ఫోన్, మూడు బ్యాంకు పాస్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మోసగాడి చేతిలో ఇంకా ఎవరైనా భక్తులు మోసపోయారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన వివరించారు.
Advertisement
Arun Kumar
TTD Darshan fraud
Tirumala Tirupati Devasthanams
Tirupati police arrest
Fake TTD tickets scam
Tirumala devotee cheating case

More Telugu News