వియత్నాంలో ఘోర ప్రమాదం.. ఏపీ, తెలంగాణ వాసులతో వెళుతున్న బోట్ మునక... 15 మంది మృతి

Vietnam Boat Accident 15 Indians From AP and Telangana Dead as Boat Sinks
  • వియత్నాంలో భారత పర్యాటకులతో వెళుతున్న స్పీడ్‌బోట్ బోల్తా
  • ప్రమాదంలో గాయపడిన పలువురి పరిస్థితి విషమం
  • ఫు క్వాక్ దీవి సమీపంలో అదుపుతప్పిన పడవ
  • రంగంలోకి దిగిన భారత ఎంబసీ.. సహాయక చర్యలు ముమ్మరం
వియత్నాంలో భారత పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక స్పీడ్‌ బోట్ సముద్రంలో బోల్తా పడి మునిగిపోయింది. ఫు క్వాక్ ద్వీపం సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో కనీసం 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతికూల వాతావరణం పరిస్థితుల కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం.

ఓషన్ పెరల్ ఐలాండ్ కంపెనీకి చెందిన 'ఏజీ-26751' అనే పర్యాటక స్పీడ్‌ బోటులో భారత పర్యాటకులు సిబ్బందితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఫు క్వాక్ దీవి సమీపంలోని హోన్ మే రుట్ న్గోయి ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో, బలమైన గాలులు మరియు అలల ఉద్ధృతికి పడవ అదుపుతప్పి బోల్తా పడింది.

స్థానిక అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు సుమారు 21 మందిని రక్షించగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

ఒక మొబైల్ కంపెనీ తరఫున సుమారు 250 మంది డిస్ట్రిబ్యూటర్లు వియత్నాం పర్యటనకు వెళ్లారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌‍కు చెందిన వారు 35 మంది, తెలంగాణకు చెందిన వారు 40 మంది ఉన్నారు. మృతుల్లో మచిలీపట్నంకు చెందిన డిస్ట్రిబ్యూటర్ గిల్లి కిశోర్ భార్య జయశ్రీ, కడపకు చెందిన ముడియం శ్రీధర్ ఉన్నట్లు గుర్తించారు. గిల్లి కిశోర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. 

కడపకు చెందిన నయీమ్ అనే డిస్ట్రిబ్యూటర్ ఆ బోటు ఎక్కకపోవడంతో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మొత్తం ఐదు బోట్లలో పర్యాటకులు విహారానికి వెళ్లగా, అందులో ఒక బోటు ప్రమాదానికి గురైంది.

ఈ విషాద ఘటనపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తక్షణమే స్పందించింది. ప్రమాదాన్ని ధ్రువీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసిన కార్యాలయం, సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని పేర్కొంది. 

బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు హో చి మిన్ సిటీ, హనోయ్‌లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను (+84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414, +84 91 308 9165) కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
Advertisement
Vietnam Boat Accident
Phu Quoc Island
Indian Tourists Dead
AP Telangana Distributors
Vietnam Speedboat Capsizes

More Telugu News