శుక్రవారం వచ్చిందనగానే ఓటీటీ లవర్స్ అంతా కూడా మలయాళం నుంచి ఏమైనా థ్రిల్లర్ సినిమాలు వచ్చాయేమోనని తప్పకుండా సెర్చ్ చేస్తారు. అందుకు కారణం ఈ జోనర్ నుంచి వచ్చే మలయాళ సినిమాలు ఒక రేంజ్ లో ఆకట్టుకుంటాయనే నమ్మకం. అలాంటి ఆడియన్స్ ఆసక్తికి తగినట్టుగానే ఈ శుక్రవారం ( జులై 10)వ తేదీన ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా పేరే 'డోస్'. సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ సినిమా, 'అమెజాన్ ప్రైమ్'తో పాటు లైన్స్ గేట్ ప్లే .. 'ఆహా'లోను అందుబాటులో ఉంది.
ప్రకాశ్ (సిజూ విల్సన్) ఒక కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తుంటాడు. అతని భార్య దివ్య ( కృషా కురూప్) అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఆమె అంటే అతనికి చాలా ఇష్టం. అందువలన ఆమె కోసం హాస్పిటల్ కి అందుబాటులోనే అతను నివసిస్తూ ఉంటాడు. అదే హాస్పిటల్లో అరుంధతి (దృశ్య రఘునాథ్) పనిచేస్తూ ఉంటుంది. చాలా కేసులు ఆమెనే డీల్ చేస్తూ ఉంటుంది. ఆమె భర్త 'పీటర్' మీడియాలో వర్క్ చేస్తుంటాడు.
గతంలో ప్రకాశ్ .. అరుంధతి ప్రేమించుకుంటారు. అయితే కొన్ని కారణాల వలన ఆమెను ప్రకాశ్ పెళ్లి చేసుకోలేకపోతాడు. గర్భవతి అయిన తనని వదిలేసి వెళ్లిన అతనిపై అరుంధతి కోపంగా ఉంటుంది. ఇద్దరూ మాట్లాడుకోపోయినప్పటికీ, ఒకే హాస్పిటల్లో పనిచేస్తుంటారు. అక్కడే జూనియర్ డాక్టర్ గా 'నిఖిల్' పనిచేస్తుంటాడు. ఆ హాస్పిటల్ కి 'సీఈఓ' గా ఉన్న గోపీనాథ్ ( జగదీశ్) కూతురు 'అభిరామి'ని అతను ప్రేమిస్తూ ఉంటాడు. అయితే నిఖిల్ ధోరణి నచ్చని కారణంగా అభిరామి అతనికి దూరంగా ఉంటుంది.
కొన్ని రోజులుగా ప్రకాశ్ చాలా డిప్రెషన్ లో ఉంటాడు. ఎందుకంటే తను టేకప్ చేసిన కేసులన్నీ ఫెయిల్ అవుతుంటాయి. పేషంట్లు ఒకరి తరువాత ఒకరిగా చనిపోతుంటారు. తనపై గల కోపంతో అరుంధతినే ఇలా చేస్తుందనే అనుమానం అతనికి కలుగుతుంది. ఫలితంగా ఈ కేసును పరిష్కరించడానికి పోలీస్ ఆఫీసర్ వివేక్ (అశ్విన్ కుమార్) రంగంలోకి దిగుతాడు. అతని ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి నిజాలు బయటపడతాయి? నేరస్థులు ఎవరు? అనేది మిగతా కథ.
ఈ కథ చాలావరకూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. హాస్పిటల్లోని రోగులు అనుమానాస్పదంగా చనిపోతుంటారు. ఆ మరణాలవెనుక ఎవరున్నారు? అందుకు గల కారణాలు ఎలాంటివి? ఏ కేసును పరిష్కరించడానికి రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ వివేక్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది ఈ కథలోని ప్రధానమైన అంశం. మెడికల్ మాఫియా .. మెడికల్ థ్రిల్లర్ నేపథ్యంలో అడపాదడపా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఒక మెడిసిన్ ను టెస్ట్ చేయడం కోసం .. హాస్పిటల్ కి వచ్చిన అమాయక కుటుంబాలను టార్గెట్ చేయడం వంటి కథలు గతంలో వచ్చాయి. అయితే అందుకు భిన్నమైన ఒక కథతో రూపొందినదిగా 'డోస్' కనిపిస్తుంది.
ఇద్దరు డాక్టర్ల మధ్య ప్రేమ వ్యవహారం, వారి వృత్తిపై ఎలాంటి ప్రభావం చూపించిందనేది ఈ కథలోని సారాంశం. ఈ కథ మొదలైన మొదటి అరగంట వరకూ, ఏం జరుగుతుందనేది మనకి అర్థం కాదు. ఆ తరువాతనే ఒక్కో విషయం ప్రేక్షకులకు అర్థమవుతూ ఉంటుంది. హీరో అనుమానాలు .. అన్వేషణలతో ఫస్టు పార్టు, అందుకు సంబంధించిన పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ తో సెకండ్ పార్టు సాగుతాయి. ఆడియన్స్ కూడా తమకి తెలియకుండానే ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడతారు. వాళ్ల సందేహాలు నర్సులు .. జూనియర్ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాయి.
ఇలాంటి కథలలో నేరస్థులు ఎవరనేది ఎలాంటి పరిస్థితులలో ఆడియన్స్ గెస్ చేయకూడదు. గెస్ చేశారంటే ఆ కథ .. స్క్రీన్ ప్లే చాలా బలహీనంగా అల్లుకోవడం జరిగిందని అర్థం చేసుకోవాలి. ఈ కథలో కూడా కొన్ని పాత్రలపైకి అనుమానాలు వెళతాయి. అయితే కావాలని ఆడియన్స్ దృష్టిని అటు వైపు తీసుకెళ్లినట్టుగా అనిపించదు. ఆ తతంగం చాలా సహజంగా జరిగిపోతుంది. ఇక అసలైన నేరస్థులు ఎవరనేది కూడా దర్శకుడు చెప్పేంత వరకూ చాలామంది కనుక్కోలేరు.
ఈ కథలో సస్పెన్స్ ఉంది .. మిస్టరీ ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లోనే నడుస్తుంది. అయితే సాధ్యమైనంత వరకూ సహజత్వానికి దగ్గరగా చూపించడానికి ప్రయత్నించారు. ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా జరిగిన ఈ ఆవిష్కరణ కొంతవరకూ ప్లస్ అయితే, మరికొంతవరకూ మైనస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. నటీనటుల నటన గురించి చెప్పుకునేంత స్థాయిలో పాత్రలను మలచలేదు. విష్ణుప్రసాద్ ఫొటోగ్రఫీ .. గోపీసుందర్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. శ్యామ్ శశిధరన్ ఎడిటింగ్ వర్క్ కూడా ఓకే. సహజమైన మలుపులు .. గెస్ చేయలేని ట్విస్ట్ ఈ కథకి ప్రధానమైన బలంగా కనిపిస్తాయి అంతే.
'డోస్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Dose Review
Movie Details
Movie Name: Dose
Release Date: 2026-07-10
Cast: Siju Wilson, Drishya Raghunath, Ashwin Kumar, krisha Kurup, Jagadish, Madhupal
Director: Abhilash Nair
Music: Gopi Sundar
Banner: -
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer