రావణ్ మీ వాడే.. కొడాలి నానీ ఇదే నీకు లాస్ట్ వార్నింగ్: బుద్దా వెంకన్న

  • చంద్రబాబు భిక్ష పెడితే కొడాలి నాని ఎమ్మెల్యే అయ్యాడన్న వెంకన్న
  • రావణ్ వైసీపీ వ్యక్తి అనే విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసని వ్యాఖ్య
  • చట్టాలను హేళన చేసిన కొడాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. కొడాలి నానిపై, వైసీపీ అధినేత జగన్‌ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "చంద్రబాబు రాజకీయ భిక్ష పెడితేనే కొడాలి నాని ఎమ్మెల్యే అయ్యాడు. అలాంటి వ్యక్తి ఈరోజు హనుమంతుడి ముందే కుప్పిగంతులు వేసినట్లు మాట్లాడుతున్నాడు" అని ధ్వజమెత్తారు.


హిందూ దేవుళ్లను అత్యంత నీచంగా కించపరిచి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను తిట్టిన దేశద్రోహి రావణ్‌కు వైసీపీ వత్తాసు పలుకుతోందని బుద్దా వెంకన్న ఆరోపించారు. "జోసెఫ్ రావణ్ మీ వైసీపీ మనిషే అని రాష్ట్రంలో అందరికీ తెలుసు. అందుకే ఆ క్రిమినల్‌కు మద్దతుగా జగన్ స్వయంగా ప్రకటనలు చేస్తున్నారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టిన అతనిపై పోలీసులు 'ఉపా' (UAPA) చట్టం కింద కేసు పెడితే... కొడాలి నాని దాన్ని 'ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం' అంటూ జోకులు వేస్తూ అవమానిస్తారా? దేశ రక్షణ కోసం ఉన్న చట్టాలను హేళన చేసిన కొడాలి నానిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు.


ఎన్నికల ఓటమి తర్వాత కొడాలి నాని, వల్లభనేని వంశీలు కొంతకాలం అడ్రస్ లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లారని... ఇప్పుడు మళ్లీ నాగుపాముల్లా బుసలు కొట్టాలని చూస్తున్నారంటూ వెంకన్న మండిపడ్డారు. "కొడాలి నాని.. నీకు ఇదే మా లాస్ట్ వార్నింగ్. ఇకపై పిచ్చిపిచ్చిగా వాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. జగన్ ఓడిపోవడానికి కొడాలి నాని లాంటి వాళ్ల బూతులే కారణమని మీ సొంత పార్టీ నేతలే ఒప్పుకున్నారు. అధికారంలో ఉంటే విర్రవీగడం.. ఓడిపోతే పుట్టల్లో దాక్కోవడం మీకు అలవాటు. ఇలాంటి విషనాగులను జగన్ పాలు పోసి పెంచుతున్నారు" అని విమర్శించారు.


వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తాము ఎక్కడా దాక్కోలేదని, జగన్ తప్పులను ఎత్తిచూపించామని బుద్దా వెంకన్న గుర్తుచేశారు. "రెండేళ్లు అడ్రస్ లేకుండా పోయి.. ఇప్పుడు వచ్చి మీడియా ముందు వాగుతున్నావు. నీకు అంతగా దమ్ముంటే రా.. బహిరంగ చర్చకు మేము సిద్ధం" అంటూ కొడాలి నానికి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.

Advertisement

More Telugu News