విజయ్ గెలుపును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు
- విజయ్ విజయాన్ని రద్దు చేయాలంటూ డీఎంకే అభ్యర్థి పిటిషన్
- పెండింగ్ కేసుల వివరాలను దాచారని ఆరోపణ
- తనను విజేతగా ప్రకటించాలని కోర్టును కోరిన వైనం
తమిళనాడు రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించి సీఎం పీఠం ఎక్కిన దళపతి విజయ్‌కు కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఆయన ఎన్నికల విజయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఆయనతో పాటు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆదవ్ అర్జున గెలుపుపై వచ్చిన పిటిషన్లను కూడా జస్టిస్ వీ లక్ష్మీనారాయణన్ ఏకసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది. పిటిషన్లలో ఉన్న కొన్ని టెక్నికల్ లోపాలను వారం రోజుల్లోగా సరిదిద్దాలని కోర్టు ఆదేశించింది. ఆ ప్రాసెస్ పూర్తి కాగానే విజయ్‌తో పాటు మంత్రికి 3 వారాల గడువిస్తూ రిజిస్ట్రీ నోటీసులు జారీ చేయనుంది.
అయితే, ఈ వ్యవహారంలో హైకోర్టు జడ్జి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఏళ్ల తరబడి సాగే ఈ ఎన్నికల పిటిషన్ల విచారణను అత్యంత వేగంగా, కేవలం ఆరు నెలల లోపే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విజయ్ విజయాన్ని సవాలు చేస్తూ డీఎంకే అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజ్ ఈ పిటిషన్ వేశారు. నామినేషన్ అఫిడవిట్‌లో విజయ్ తనపై ఉన్న పెండింగ్ కేసుల వివరాలను దాచారని, అలాగే ఎన్నికల ఖర్చులను కూడా పూర్తిగా చూపించలేదని ఇనిగో తన ఫిర్యాదులో ఆరోపించారు.
దీనికి తోడు, ఎన్నికల ప్రచారంలో నిబంధనలకు విరుద్ధంగా చిన్నపిల్లలను వాడుకున్నారనే అంశాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ కారణాలన్నింటినీ చూపిస్తూ విజయ్ విజయాన్ని రద్దు చేసి, తనను విజేతగా ప్రకటించాలని ఇనిగో కోరారు. అంతేకాకుండా, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గ ఉపఎన్నికపై కూడా స్టే విధించాలని డీఎంకే అభ్యర్థి హైకోర్టును కోరడంతో ఇప్పుడు ఈ సరికొత్త పొలిటికల్ వార్ తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.