నా రక్తంలోనే కాషాయం ఉంది: పేర్ని నాని విమర్శలకు మంత్రి సత్యకుమార్ యాదవ్ కౌంటర్!

Satya Kumar Yadav counters Perni Nani saying saffron is in his blood
  • చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే వ్యక్తి పేర్ని నాని అని సత్యకుమార్ ఎద్దేవా
  • తాను పదవుల కోసం ఆశపడే వ్యక్తి కాదని వ్యాఖ్య
  • జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపైనే తన పోరాటమన్న మంత్రి

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. పేర్ని నానిని 'చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వ్యక్తి'గా అభివర్ణించారు. తాను రాజకీయ లబ్ధి కోసం పార్టీలు మారే అవకాశవాదిని కాదని, తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వ్యక్తినని స్పష్టం చేశారు.


"నేను పదవుల కోసం ఆశపడే వ్యక్తిని కాదు. నా రక్తంలోనే కాషాయం, బీజేపీ సిద్ధాంతం ఉన్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఒక మంత్రిగా... ప్రభుత్వంపై చేసే అర్థరహితమైన విమర్శలను చూస్తూ ఊరుకోను" అని సత్యకుమార్ హెచ్చరించారు. వైసీపీ అధినేత జగన్ ను తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ దూషించలేదని... ఆయన అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైనే తన పోరాటమని చెప్పారు. జగన్ ఒక నిలకడ లేని మనిషి అని, రాజధాని విషయంలో ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే కనీస అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేసి, అతి త్వరలోనే పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 


కూటమి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు గణనీయంగా మెరుగయ్యాయని సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వ్యవస్థను గాడిలో పెట్టాల్సి ఉందని, దానిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రజల నుంచి వస్తున్న ప్రతి చిన్న సమస్య, ఫిర్యాదుపై తక్షణమే స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Satya Kumar Yadav
Perni Nani
Andhra Pradesh Politics
BJP YCP Clash
Amaravati Capital City
AP Health Minister

More Telugu News