అమెరికా స్వాతంత్య్రం వెనుక మైసూర్ రాజులు.. 250 ఏళ్ల నాటి చరిత్రలో షాకింగ్ నిజాలు!

Mysore Kings behind American independence shocking facts from 250 year old history
  • అమెరికా స్వాతంత్య్రంలో మైసూర్ పాత్ర
  • బ్రిటన్‌ను దెబ్బకొట్టిన మైసూర్ యుద్ధాలు
  • అమెరికా యుద్ధనౌకకు హైదరాలీ పేరు
  • ఒకే శత్రువుపై సమాంతర పోరాటం
  • విస్మరణకు గురైన చారిత్రక బంధం
అమెరికా తన 250వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న వేళ.. 18వ శతాబ్దపు చరిత్ర పుటల్లో కనుమరుగైన ఒక ఆసక్తికరమైన భారత్-అమెరికా బంధం వెలుగులోకి వచ్చింది. నాటి అమెరికా విముక్తి పోరాటంలో బ్రిటన్ సామ్రాజ్యాన్ని ముప్పుతిప్పలు పెట్టడంలో భారతదేశంలోని మైసూర్ పాలకులైన హైదరాలీ, ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ పరోక్షంగా అత్యంత కీలక పాత్ర పోషించారు. జార్జ్ వాషింగ్టన్ నేతృత్వంలో అమెరికా కాలనీలు బ్రిటన్‌తో పోరాడుతున్న సమయంలోనే, దానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మైసూర్ పాలకులు కూడా అదే శత్రువుపై (బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ) సమాంతరంగా యుద్ధం ప్రకటించి వారి సైనిక, ఆర్థిక శక్తినే కాకుండా వ్యూహాత్మక దృష్టిని కూడా చీల్చారు.

చరిత్రకారుల కథనం ప్రకారం.. 1780-1784 మధ్య జరిగిన రెండో ఆంగ్లో-మైసూర్ యుద్ధం అమెరికా విముక్తి పోరాటంలో ఒక నిర్ణయాత్మక మలుపుగా మారింది. ఫ్రాన్స్ దేశం అమెరికా తిరుగుబాటుదారులతో పాటు మైసూర్ పాలకుడు హైదరాలీకి కూడా సైనిక సరఫరాలు, నౌకాదళ మద్దతును అందించింది. దీంతో బ్రిటన్ ఒకే సమయంలో అమెరికా, యూరప్, భారత్ వంటి పలు ప్రాంతాల్లో బహుముఖ యుద్ధాలు చేయాల్సి వచ్చింది. బ్రిటన్ తన రాయల్ నేవీ నౌకల్లో ఐదో వంతు నౌకలను మైసూర్ థియేటర్‌లోనే మోహరించాల్సి రావడం వల్ల, వారు అమెరికా వైపు పూర్తి వనరులను కేంద్రీకరించలేకపోయారు. దీనివల్ల బ్రిటన్ యుద్ధ ప్రయత్నాలు భారంగా, సంక్లిష్టంగా మారి చివరకు అమెరికా చేతిలో పరాజయానికి దారితీశాయి.

ఈ సమాంతర పోరాటం కారణంగా నాడు అమెరికన్లకు హైదరాలీ ఒక హీరోగా మారారు. ఫిలడెల్ఫియా వీధుల్లో ఆయనను కీర్తిస్తూ గీతాలు ఆలపించేవారు. ఎంతలా అంటే, 1781లో పెన్సిల్వేనియా ఒక యుద్ధనౌకకు 'హైదర్ అలీ' అని పేరు పెట్టింది. ఆ నౌక తర్వాతి కాలంలో బ్రిటన్‌కు చెందిన పెద్ద యుద్ధనౌక 'జనరల్ మాంక్'ను ఓడించి అమెరికా నౌకాదళ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.

1781 అక్టోబర్‌లో యార్క్‌టౌన్‌లో బ్రిటిష్ జనరల్ కార్న్‌వాలిస్ లొంగిపోవడాన్ని, భారత్‌లో హైదరాలీ సాధించిన విజయాలను న్యూజెర్సీలో ప్రజలు కలిసి వేడుక చేసుకున్నారు. హైదరాలీ మరణానంతరం టిప్పు సుల్తాన్ సాగించిన పోరాటాన్ని కూడా అమెరికా పత్రికలు క్రమం తప్పకుండా ప్రచురించాయి. అయితే అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రణలోని భారతీయ మార్కెట్లతో వ్యాపార సంబంధాల కోసం అమెరికా ప్రాధాన్యతలను మార్చుకోవడంతో ఈ చారిత్రక బంధం క్రమంగా విస్మరణకు గురైంది.
Hyder Ali
Tipu Sultan
American Revolutionary War
Mysore Kingdom
Anglo Mysore War
US Independence History

More Telugu News