వర్షపు నీటితో నిండిన గుంతలో పడిపోయిన బైక్... వీడియో వైరల్
- గుజరాత్ జూనాగఢ్‌లో రోడ్డు ప్రమాదం
- ఈ ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన సీసీటీవీ ఫుటేజ్
- మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై వెల్లువెత్తిన విమర్శలు
జునాగఢ్‌లోని ఆజాద్ చౌక్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నిలిచిన వర్షపు నీటి కారణంగా గుంత కనిపించకపోవడంతో బైక్ ముందు చక్రం అందులో పడిపోయింది. ఫలితంగా వాహనదారుడు నియంత్రణ కోల్పోగా, వెనుక కూర్చున్న మహిళతో సహా ఇద్దరూ కిందపడిపోయారు. ప్రమాద సమయంలో ఇరువురూ హెల్మెట్లు ధరించలేదు. కిందపడిన వ్యక్తి తలకు బలమైన గాయం కావడంతో ఫిట్స్ వచ్చినట్లుగా కొట్టుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. స్థానికులు తక్షణమే స్పందించి బాధితులకు సహాయం అందించారు. అనంతరం గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
రోడ్డు తవ్వకం పనులను అసంపూర్తిగా వదిలేయడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షపు నీరు చేరడంతో ఆ గుంత వాహనదారులకు కనిపించకుండా ప్రమాదకరంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన జునాగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, మరమ్మతు పనుల్లో భాగంగానే ఇలా జరిగిందని వివరించారు. వెంటనే అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు. అలాగే, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.