"సైలెంట్ గా ఎదుగుతోంది"... విశాఖపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనం!
- భారత ఏఐ హబ్‌గా అవతరిస్తున్న విశాఖపట్నం
- 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు
- రిలయన్స్, మెటా సంస్థల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు
- సబ్‌సీ కేబుల్స్, క్లీన్ ఎనర్జీ లభ్యత వైజాగ్‌కు ప్రధాన బలం
- 'ఏఐ పట్నం'గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ప్రోత్సాహం
గూగుల్ భారీ అడుగు
అమెరికా వెలుపల తన అతిపెద్ద మౌలిక సదుపాయాల పెట్టుబడికి గూగుల్ విశాఖను ఎంచుకోవడం ఈ పరిణామాల్లో అత్యంత కీలకం. గూగుల్ ఇక్కడ ఏకంగా 15 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1.25 లక్షల కోట్లు) పెట్టుబడితో 'గూగుల్ ఏఐ హబ్' ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా అత్యాధునిక డేటా సెంటర్లు, సబ్‌సీ కేబుల్స్, స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టులు, స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టనుంది. 'అమెరికా-ఇండియా కనెక్ట్' పేరుతో విశాఖను సింగపూర్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో సముద్రగర్భ కేబుల్స్ ద్వారా అనుసంధానించనుంది.
పోటీ పడుతున్న దిగ్గజాలు
గూగుల్ మాత్రమే కాకుండా ఇతర సంస్థలు కూడా విశాఖపై దృష్టి సారించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూక్‌ఫీల్డ్, డిజిటల్ రియాల్టీల జాయింట్ వెంచర్ అయిన 'డిజిటల్ కనెక్షన్'.. 2030 నాటికి రూ.98,000 కోట్ల పెట్టుబడితో 400 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం గల ఏఐ-నేటివ్ డేటా సెంటర్ క్లస్టర్‌ను నిర్మించాలని యోచిస్తోంది. మరోవైపు, సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' కూడా సిఫీ టెక్నాలజీస్ నిర్మిస్తున్న 500 మెగావాట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌లో లీజుకు స్థలాన్ని తీసుకుంటున్నట్లు సమాచారం.
విశాఖ ఎందుకంత ప్రత్యేకం?
ప్రపంచ సంస్థలను విశాఖ ఆకర్షించడానికి అనేక కారణాలున్నాయి. సముద్ర తీర ప్రాంతం కావడం సబ్‌సీ కేబుల్స్ ల్యాండింగ్‌కు అనువుగా ఉంది. బెంగళూరు, ముంబై వంటి నగరాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో పాటు, భారీ స్థాయిలో భూమి లభ్యత, పోర్టు సౌకర్యం, పునరుత్పాదక ఇంధన వనరులు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 600 ఎకరాల భూమి కేటాయించడం, అనుమతులను వేగవంతం చేయడం, అనువైన విద్యుత్ విధానాలు వంటి ప్రోత్సాహకాలు పెట్టుబడుల ప్రవాహానికి ఊతమిస్తున్నాయి.
ఈ పరిణామాలు కేవలం డేటా సెంటర్లకే పరిమితం కాకుండా విద్యుత్, కనెక్టివిటీ, స్థానిక నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలను కలుపుకొని ఒక సంపూర్ణ ఏఐ పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తున్నాయి. ఈ భారీ పెట్టుబడులతో విశాఖపట్నం ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోవడమే కాకుండా, భారతదేశ ఏఐ ప్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఒక కీలక పాత్ర పోషించనుంది.