ఏసీబీ వలలో అవినీతి అధికారి.. డీఎస్పీ ఇంట్లో కట్టల కొద్దీ నోట్లు, బంగారం!

Sankireddy Bheem Reddy Corrupt officer in ACB net bundles of cash and gold in DSP house
  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీంరెడ్డి అరెస్ట్
  • తెలంగాణ, కర్ణాటకలో పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు
  • విల్లాలు, ఫ్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, 45 ఎకరాల భూములు గుర్తింపు
  • రూ.43 లక్షల నగదు, 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి స్వాధీనం
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ పోలీస్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీంరెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమాస్తులను గుర్తించారు.

ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ పర్యవేక్షణలో సుమారు 20 బృందాలు ఈ దాడులలో పాల్గొన్నాయి. హైదరాబాద్ శివారు నార్సింగిలోని 'వెస్సెల్లా మీడోస్‌'లో ఉన్న భీంరెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో విల్లాలు, పెంట్‌హౌస్‌లు, ఫ్లాట్లు, వాణిజ్య సముదాయాలు, ఖాళీ ప్లాట్లు మరియు వ్యవసాయ భూములకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సోదాల సందర్భంగా రూ. 43.06 లక్షల నగదు, 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులను ఏసీబీ అధికారులు కనుగొన్నారు. వీటితో పాటు గచ్చిబౌలి, తెల్లాపూర్‌లలో ఫ్లాట్లు, మణికొండలో నిర్మాణంలో ఉన్న వాణిజ్య సముదాయంలో వాటా, సంగారెడ్డి జిల్లాతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 45 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. అలాగే 'శ్రీ రాఘవేంద్ర రాక్ శాండ్ మినరల్స్‌'లో రూ. 75 లక్షల మేర పెట్టుబడులు పెట్టినట్టలు నిర్ధారించారు.

తెల్లాపూర్‌లో రెండు ప్లాట్లు, ప్రగతి రిసార్ట్స్‌ సమీపంలో 500 గజాల ప్లాట్, నాగోల్ కామినేని ఆసుపత్రి సమీపంలో 200 గజాల ప్లాట్, పటాన్‌చెరు జీపీఆర్ హౌసింగ్ సొసైటీ పరిధిలో 400 గజాల ప్లాట్, వికారాబాద్ జిల్లా మొమిన్‌పేటలో 1,000 గజాల స్థలంతో పాటు వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ. 19.91 లక్షల నగదు నిల్వలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (పీసీఎస్) విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న భీంరెడ్డిని అదుపులోకి తీసుకుని అధికారికంగా అరెస్ట్ చేసినట్లు ఏసీబీ ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల మార్కెట్ విలువ కోట్లాది రూపాయల్లో ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తుండగా, ఆస్తులు పూర్తిస్థాయి లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.
Sankireddy Bheem Reddy
Telangana ACB
Disproportionate Assets Case
Hyderabad
Telangana Police DSP

More Telugu News