తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

Pawan Kalyan visits Tirumala Sri Venkateswara Swamy temple
  • తిరుపతి జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తిరుమలకు పవన్
  • వేదపండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాల అందజేత
  • ప్రస్తుతం దీక్షలో ఉన్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం సాయంత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుపతి జిల్లాలో జరిగిన అధికారిక పర్యటనను ముగించుకున్న అనంతరం ఆయన తిరుమలకు చేరుకుని మొక్కులు చెల్లించుకుని, శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

అంతకుముందు, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కవారిపల్లెలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్' (వీబీ-జీ-రామ్-జీ) పథకం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు హాజరైన ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రారంభమైంది.

ప్రభుత్వ కార్యక్రమం ముగిసిన తర్వాత తిరుమలకు చేరుకున్న పవన్ కల్యాణ్‌కు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు.

తిరుమల పర్యటనలో పవన్ వెంట తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కల్యాణం శివ శ్రీనివాస, హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణ తేజ తదితరులు ఉన్నారు.
Pawan Kalyan
Tirumala
Tirupati
Andhra Pradesh Deputy CM
Venkateswara Swamy Darshan
Viksit Bharat Gramin

More Telugu News