శివాజీకి అత్యంత ప్రియమైన కోట.. 'లోహగఢ్' రహస్యమేంటి?
- ‘లోహ్‌గఢ్’ అంటే ‘ఇనుప కోట’ అని అర్థం
- ఇనుప ఖనిజం అధికంగా ఉన్న కొండపై ఈ కోట నిర్మాణం
- వెయ్యేళ్లుగా ఎన్నో రాజవంశాల పాలనను తట్టుకుని నిలిచింది
- శివాజీ మహారాజు రెండుసార్లు ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు
- ‘వించూ కాటా’ (తేలు తోక) ఈ కోటలోని ప్రత్యేక ఆకర్షణ
‘లోహ్‌గఢ్’ పేరు వెనుక కథ
‘లోహ’ అంటే ఇనుము. 'గఢ్' అంటే కోట. ఈ రెండు పదాలు కలిసి 'లోహ్‌గఢ్'గా మారాయి. సముద్ర మట్టానికి 1,033 మీటర్ల ఎత్తులో సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉన్న ఈ కోట ఇనుప ఖనిజం అధికంగా ఉన్న రాతి కొండపై నిర్మించారు. బలమైన సహజ పునాది కారణంగా ఈ కోటపై దాడి చేయడం శత్రువులకు చాలా కష్టంగా ఉండేది. అందుకే కాలక్రమంలో దీనిని ‘ఇనుప కోట’గా పిలవడం ప్రారంభించారు.
ఎన్నో రాజవంశాలకు సాక్ష్యం
లోహ్‌గఢ్ కోటకు వెయ్యేళ్లకుపైగా చరిత్ర ఉంది. శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, యాదవులు, బహమనీ సుల్తానులు, నిజాంలు, మొఘలులు, మరాఠాలు ఇలా అనేక రాజవంశాలు ఈ కోట నుంచి పాలించాయి. పాలకులు మారినా కోట మాత్రం చెక్కుచెదరలేదు. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ మార్పులను తట్టుకుని నిలిచిన ఈ కోట నిజంగానే తన పేరుకు తగ్గట్టే ఇనుప సంకల్పానికి ప్రతీకగా నిలిచింది.
శివాజీకి అత్యంత ప్రియమైన కోట
ఛత్రపతి శివాజీ మహారాజు 1648లో ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. 1665లో పురందర్ ఒప్పందం తర్వాత మొఘలులకు అప్పగించాల్సి వచ్చినా 1670లో తిరిగి తన అధీనంలోకి తెచ్చుకున్నారు. సూరత్ యాత్రలో సంపాదించిన సంపదలో పెద్ద భాగాన్ని శివాజీ ఈ కోటలోనే భద్రపరిచినట్లు చరిత్ర చెబుతోంది. కిలోమీటర్‌కు పైగా విస్తరించిన బలమైన ప్రహరీ గోడలు ఇప్పటికీ పర్యాటకులను ఆశ్చర్యపరుస్తుంటాయి.
ప్రత్యేక ఆకర్షణ ‘వించూ కాటా’
లోహ్‌గఢ్ కోటలో అత్యంత ప్రత్యేకమైన భాగం 'వించూ కాటా'. మరాఠీలో దీనికి 'తేలు తోక' అనే అర్థం. కోట నుంచి బయటకు పొడుచుకొచ్చిన ఈ రాతి నిర్మాణంపై నుంచి చూస్తే తేలు తోకలా కనిపిస్తుంది. ఇది శత్రువుల కదలికలను ముందుగానే గమనించేందుకు సైనికులకు ఉపయోగపడేది. నేడు ఇదే లోహ్‌గఢ్ కోటకు ప్రధాన ఆకర్షణగా మారింది.