ఢిల్లీ హైకోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ

Ilaiyaraaja faces setback in Delhi High Court over copyright case
  • 134 సినిమాల పాటలకు సంబంధించిన కాపీరైట్ వివాదం
  • ఆ సినిమాల్లోని పాటలపై తమకే హక్కులు ఉన్నాయన్న 'సారేగామా'
  • తాను స్వరపరిచిన పాటలపై మరెవరికో హక్కులు ఉండటమేంటన్న ఇళయరాజా

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు 134 సినిమాల పాటల యాజమాన్య హక్కులకు సంబంధించిన కాపీరైట్ వివాదంలో ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో జారీ చేసిన మధ్యంతర నిషేధాజ్ఞ‌ను ఎత్తివేయాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు పూర్తిగా తిరస్కరించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు యథాతథంగా కొనసాగనున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.


ఈ వివాదంలో ప్రముఖ సంగీత సంస్థ 'సారేగామా' రంగంలోకి దిగి, ఆ 134 చిత్రాల్లోని పాటలపై పూర్తి కాపీరైట్ హక్కులు తమకే ఉన్నాయని, తాము చట్టబద్ధంగానే వాటిని పొందామని కోర్టుకు తెలిపింది. మరోవైపు, సదరు సినిమాలకు తానే ప్రాణం పోశానని, తాను స్వరపరిచిన పాటలపై మరెవరికో హక్కులు ఉండటం ఏంటని, వాటిపై తనకు కూడా పూర్తి అధికారాలు ఉంటాయని ఇళయరాజా గట్టిగా వాదిస్తున్నారు. ఈ కాపీరైట్ అంశంపై ఇరు పక్షాల మధ్య గత కొంతకాలంగా న్యాయపోరాటం నడుస్తోంది.


మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలన్న ఇళయరాజా అప్పీల్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఆదేశాలను ఎత్తివేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈ కాపీరైట్ వివాదంపై పూర్తిస్థాయి విచారణ జరిగి, తుది తీర్పు వెలువడే వరకూ ప్రస్తుతం అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులే కొనసాగుతాయని వెల్లడించింది. భారతీయ సంగీత పరిశ్రమలో ఒకేసారి ఇన్ని సినిమాల పాటల హక్కులపై వివాదం రేగడం ఇదే మొదటిసారి కావడంతో, ఈ కేసు తుది తీర్పు భవిష్యత్తులో కాపీరైట్ చట్టాల విషయంలో అత్యంత కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Ilaiyaraaja
Delhi High Court
Saregama
Copyright Dispute
Music Rights
Film Songs

More Telugu News