‘సంతోషం.. ఉద్యోగం పోతోంది’.. మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగి ఎమోషనల్‌ పోస్ట్‌!

Microsoft employee emotional post on losing job and feeling relief
  • లేఆఫ్‌కు గురయ్యే అవకాశం ఉందంటూ మైక్రోసాఫ్ట్ ఉద్యోగి వైరల్ పోస్టు
  • ఉద్యోగం పోవడం కంటే అనిశ్చితే ఎక్కువ ఒత్తిడికి గురిచేసిందని వ్యాఖ్య
  • కీలక ప్రాజెక్టుల నుంచి తప్పించడంతో పరిస్థితి అర్థమైందని వెల్లడి
  • ఉద్యోగి పోస్టుకు సోషల్ మీడియాలో విస్తృత స్పందన
మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి చేసిన భావోద్వేగ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. త్వరలో కంపెనీ చేపట్టనున్న ఉద్యోగుల కోతలో తన పేరు కూడా ఉంటుందని భావిస్తున్న ఆ ఉద్యోగి.. ‘‘ఉద్యోగం పోతుందనే బాధ కంటే, ఎప్పుడెప్పుడు లేఆఫ్ అవుతానో అనే అనిశ్చితి నుంచి బయటపడుతున్నాననే ఉపశమనం ఎక్కువగా ఉంది’’ అంటూ రాసుకొచ్చాడు.

తన మేనేజర్‌కు లేఆఫ్ జాబితా అందబోతుందని, తన పేరు కూడా అందులో ఉంటుందని తనకు ఇప్పటికే అర్థమైందని పేర్కొన్నాడు. గత కొంతకాలంగా తనను కీలక ప్రాజెక్టుల నుంచి తప్పించడం, మేనేజర్ నుంచి స్పందన తగ్గిపోవడం, ఆఫీసులో జరుగుతున్న మార్పులు చూసి పరిస్థితి స్పష్టంగా తెలిసిపోయిందని వివరించాడు.

‘‘ఉద్యోగం పోవడం సంతోషించాల్సిన విషయం ఏమీ కాదు. మార్కెట్ కూడా అంత అనుకూలంగా లేదు. అయినా నాకు ఉపశమనం కలుగుతోంది. ఎందుకంటే నెలల తరబడి వెంటాడుతున్న అనిశ్చితికి ఇక ముగింపు రాబోతోంది. ప్రతి త్రైమాసికం ‘తర్వాతి వంతు నాదేనా’ అన్న భయంతో బతకడం ఉద్యోగం కోల్పోవడం కంటే ఎక్కువ ఆందోళనకు గురిచేసింది’’ అని పోస్టులో పేర్కొన్నాడు.

‘‘ఒక దశకు వచ్చాక ఉద్యోగం పోతుందేమో అన్న భయం తగ్గిపోతుంది. కానీ ఇలాంటి వాతావరణంలో కొనసాగితే మనపై ఎలాంటి ప్రభావం పడుతుందో అన్నదే పెద్ద ఆందోళనగా మారుతుంది’’ అని రాసుకొచ్చాడు. ఈ పోస్టుపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. తమకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని, ఉద్యోగం కోల్పోయిన తర్వాతే మానసికంగా ప్రశాంతంగా అనిపించిందని పలువురు కామెంట్లు చేశారు.
Microsoft
Microsoft layoffs
Emotional social media post
Tech job cuts
Employee layoff experience
Job uncertainty relief

More Telugu News