విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర? ఎమ్మెల్యేలకు రూ.35 కోట్ల ఆఫర్ ఆరోపణలు

Vijay government toppling conspiracy allegations of 35 crore offer to MLAs
  • 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాల ద్వారా ప్రభుత్వం పడగొట్టే యత్నమని ప్రచారం
  • ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్ ఇచ్చారన్న ఆరోపణలతో ముగ్గురి అరెస్ట్
  • డీఎంకే నేత సెంథిల్ బాలాజీ పేరు ప్రస్తావనకు రావడం రాజకీయంగా చర్చనీయాంశం
  • ఆరోపణలను డీఎంకే ఖండిస్తూ.. ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవాలని సవాల్
తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందంటూ సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ కుట్రను రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం భగ్నం చేసిందని, ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎన్‌డీటీవీ తన కథనంలో పేర్కొంది.

ఎన్‌డీటీవీ కథనం ప్రకారం.. విజయ్ పార్టీకి చెందిన ఉతంగరై ఎమ్మెల్యే ఎన్. ఎలైయరాజా ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌పై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని, అందుకు రూ.35 కోట్లు ఇస్తామని ఓ కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధి తనను సంప్రదించాడని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ విషయాన్ని బయటకు చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తొలుత చెన్నైలో ఒకరిని, అనంతరం కరూర్‌లో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో ఈ వ్యవహారానికి డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీతో సంబంధాలున్నట్లు గుర్తించినట్లు ఎన్‌డీటీవీ పేర్కొంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు.

ఈ ఘటనపై స్పందించిన తమిళనాడు మంత్రి సీటీ నిర్మల్ కుమార్.. సెంథిల్ బాలాజీకి సన్నిహితులే ఈ కుట్రలో ఉన్నారని ఆరోపించారు. విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పలువురు ఎమ్మెల్యేలకు రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఆఫర్లు ఇచ్చారని కూడా ఆయన ఆరోపించారు.

అయితే ఈ ఆరోపణలను డీఎంకే ఖండించింది. దర్యాప్తు వివరాలను లీక్ చేసి ప్రజల్లో తప్పుడు ప్రచారం సృష్టించే ప్రయత్నం జరుగుతోందని డీఎంకే అధికార ప్రతినిధి ఏ. శరవణన్ విమర్శించారు. తమ వద్ద ఆధారాలు ఉంటే సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు.
Vijay
Tamil Nadu Government
Senthil Balaji
MLA Elayaraja
Political Conspiracy Tamil Nadu
35 Crore Bribery Case

More Telugu News