కోట్ల ఆస్తి కోసం హనీ ట్రాప్?.. మతమార్పిడి కేసులో సంచలనంగా మారిన డైరీ!

Ayush Malik honey trap for property worth crores sensational diary in conversion case
  • ఆయుష్ మాలిక్ మతమార్పిడి కేసు 
  • యువకుడి ఇంట్లో పోలీసుల సోదాలు 
  • డైరీ, కత్తి, మొబైల్ ఫోన్లు స్వాధీనం 
  • మళ్లీ హిందూమతంలోకి చేరిన యువకుడు 
  • ప్రియురాలి కుటుంబంపై ఆస్తి కుట్ర ఆరోపణలు
ఉత్తరప్రదేశ్‌లోని శామ్లీ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆయుష్ మాలిక్ మతమార్పిడి కేసు దర్యాప్తులో యూపీ పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ముస్లిం మతంలోకి మారి, ఆ తర్వాత తిరిగి హిందూమతంలోకి వచ్చిన ఆయుష్ మాలిక్ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లభించిన ఒక డైరీలోని మొదటి పేజీలో "నేను ఒక మిషన్‌లో ఉన్నాను – ఆయుష్ మాలిక్" అని రాసి ఉన్న వాక్యం ఇప్పుడు పోలీసుల విచారణలో అత్యంత కీలకంగా మారింది. ఈ మతమార్పిడి వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ సోదాల్లో డైరీతో పాటు ఒక పెద్ద కత్తి, రెండు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు, ఈ మతమార్పిడికి కారణమైనట్లు భావిస్తున్న ఒక మత పెద్ద (మౌల్వీ) ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే, ఈ పరిణామాల మధ్యే ఆయుష్ మాలిక్ తాను స్వచ్ఛందంగా తిరిగి హిందూమతంలోకి మారుతున్నట్లు ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో అతడు హిందూ సంప్రదాయాల ప్రకారం పూజలు చేస్తూ కనిపించాడు. తల్లిదండ్రుల బాధను చూసి, మనస్తాపంతోనే అతడు తిరిగి స్వగృహానికి, స్వమతానికి చేరుకున్నట్లు ఆయుష్ తండ్రి దేవరాజ్ మాలిక్ తెలిపారు.

 కోట్ల ఆస్తి కోసమే కుట్ర? 
ఫిజియోథెరపిస్ట్ అయిన చాందిని ఖురేషి, ఆమె తండ్రి ఇస్లాం ఖురేషి కలిసి తమ కొడుకు మనసు మార్చి తప్పుదోవ పట్టించారని ఆయుష్ తండ్రి దేవరాజ్ మాలిక్ ఆరోపించారు. తమ కుటుంబానికి ఉన్న కోట్ల రూపాయల విలువైన ఆస్తిని హస్తగతం చేసుకునేందుకే ప్రణాళికాబద్ధంగా ఈ కుట్రకు పాల్పడి, ఆయుష్‌ను ముస్లింగా మార్చారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మతమార్పిడి నిరోధక చట్టం కింద చాందిని, ఆమె తండ్రిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

ఎఫ్ఐఆర్ ప్రకారం.. బి-ఫార్మసీ పూర్తి చేసి తమ కుటుంబ మెడికల్ స్టోర్‌ను చూసుకునే ఆయుష్‌కి, 2018లో కాలి గాయానికి చికిత్స పొందుతున్న సమయంలో చాందిని పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో, ఆమె కుటుంబ సభ్యులు నెమ్మదిగా ఆయుష్‌ను ఇస్లాం వైపు ప్రేరేపించారు. 2023లో అతడిని ఢిల్లీకి తీసుకెళ్లి 'మహమ్మద్ అలీ'గా పేరు మార్చి, నిఖా కూడా జరిపించారని ఆయుష్ తండ్రి ఆరోపించారు. అయితే దీనికి సంబంధించిన వివాహ ధ్రువీకరణ పత్రాలు ఏవీ ఇంకా లభించలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం లభించిన డైరీ నోట్, ఇతర వస్తువుల ఆధారంగా శామ్లీ పోలీసులు కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
Ayush Malik
Shamli conversion case
Uttar Pradesh police
Honey trap property conspiracy
Chandni Qureshi
Ghar Wapsi

More Telugu News