సీఎం చంద్రబాబుతో జ్యుడిషియల్ అధికారుల భేటీ.. సమస్యల పరిష్కారానికి వినతి
- సీఎం చంద్రబాబును కలిసిన ఏపీ జ్యూడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
- జ్యుడిషియల్ జిల్లాల పునర్విభజన, కొత్త కోర్టుల ఏర్పాటుకు వినతి
- అధికారుల సంక్షేమం, వసతులపై పలు విజ్ఞప్తులు
- సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూల హామీ
పరిపాలనా జిల్లాల పునర్విభజన తర్వాత తలెత్తిన సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించాలని కోరినట్లు ప్రతినిధులు తెలిపారు. జ్యుడిషియల్ అధికారుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలను కూడా వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని, అధికారుల కుటుంబాలకు నగదు రహిత (క్యాష్‌లెస్) వైద్య సేవలు అందించాలని కోరారు. వీటితో పాటు సాఫ్ట్ లోన్ పరిమితిని పెంచాలని, ఇంటి స్థలాలు కేటాయించాలని విన్నవించారు.
అసోసియేషన్ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. జ్యుడిషియల్ జిల్లాల ఏర్పాటు, ఇతర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో అసోసియేషన్ అధ్యక్షులు జి. చక్రపాణి, ప్రధాన కార్యదర్శి ఎన్. రమేశ్ నాయుడు, ఇతర ప్రతినిధులు ఉన్నారు.