మామిడి దిగుబడి పెరిగినందునే కొనుగోళ్లపై ఒత్తిడి పెరిగింది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Ramprasad Reddy assures Chittoor mango farmers of full government suppo
  • మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి
  • మామిడి కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నామని వెళ్లడి
  • రైతుల ప్రయోజనాలే తమకు పరమావధి అన్న మంత్రి

చిత్తూరు జిల్లా మామిడి రైతులకు ప్రభుత్వం అన్ని  విధాలా అండగా ఉంటుందని, వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన... గత ఏడాది కూడా కూటమి ప్రభుత్వం రైతులకు కేజీకి రూ.4 చొప్పున అదనంగా చెల్లించి ఆదుకుందని గుర్తుచేశారు. ఈ ఏడాది కూడా అదే రీతిన కేజీకి రూ.4 ముందస్తుగా అందిస్తూ మామిడి కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. 


ఈసారి పంట దిగుబడి ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా రావడం వల్లే కొనుగోళ్లపై తాత్కాలికంగా కొంత ఒత్తిడి పెరిగిందని, అంతకుమించి మరేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది కూడా మామిడి రైతుల కోసం ప్రభుత్వం సుమారు రూ.190 కోట్లు వెచ్చించి అండగా నిలిచిందని ఈ సందర్భంగా ఆయన వివరించారు.


రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ఒకవేళ కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడైనా జాప్యం జరిగితే మాత్రం సంబంధిత ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన, ఆ పార్టీ సానుభూతి కంపెనీలు కొనుగోళ్ల విషయంలో కావాలని అలసత్వం ప్రదర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే పరమావధి అని స్పష్టం చేసిన మంత్రి... కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం రైతుల సమస్యలను వాడుకోవాలని చూడొద్దంటూ వైసీపీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

Ramprasad Reddy
Chittoor mango farmers
Mango procurement Andhra Pradesh
Andhra Pradesh agriculture news
Peddireddy Ramachandra Reddy
Mango crop yield 2024

More Telugu News