ఏపీలో విద్యా సంస్కరణలు భేష్.. నారా లోకేశ్‌పై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసల వర్షం

Nara Lokesh receives praise from Dharmendra Pradhan for AP education reforms
  • భోగాపురం పీఎంశ్రీ మోడల్ స్కూల్‌ను సందర్శించిన కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, లోకేశ్
  • పాఠశాలలో ఆధునిక విద్యాబోధన, టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించిన బృందం
  • లీప్ డ్యాష్‌బోర్డు, స్మార్ట్ కిచెన్ల వ్యవస్థ గురించి కేంద్ర మంత్రికి వివరించిన లోకేశ్
  • తరగతి గదిలో విద్యార్థులతో సరదాగా ముచ్చటించి వారి నైపుణ్యాలను పరిశీలించిన మంత్రులు
ఆంధ్రప్రదేశ్ విద్యారంగం అభివృద్ధికి, నూతన విద్యావిధానాల అమలుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక శ్రద్ధతో చేస్తున్న కృషి అభినందనీయమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు లోకేశ్ చూపిస్తున్న చొరవను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. మంగళవారం విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్‌ను మంత్రి నారా లోకేశ్‌తో కలిసి ధర్మేంద్ర ప్రధాన్ సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా పాఠశాలలో అమలు చేస్తున్న ఆధునిక విద్యాబోధన పద్ధతులు, మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు.

పాఠశాలకు చేరుకున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌కు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సి. పార్వతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. విద్యార్థులు, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మంత్రులు పాఠశాల ప్రాంగణమంతా కలియతిరిగారు.

టెక్నాలజీ, సంప్రదాయాల మేళవింపు

పర్యటనలో భాగంగా, విద్యాబోధనలో వినియోగిస్తున్న పలు ఆధునిక ఉపకరణాలను మంత్రులు పరిశీలించారు. ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం రూపొందించిన 'జాదూ పిఠారా' కిట్‌ను కేంద్ర మంత్రి ఆసక్తిగా గమనించగా, దాని పనితీరును మంత్రి లోకేశ్, సిబ్బంది వివరించారు. 

విద్యార్థుల ప్రగతిని నమోదు చేసే ప్రోగ్రెస్ కార్డులు, అసెస్‌మెంట్ బుక్‌లెట్లను లోకేశ్ కేంద్ర మంత్రికి చూపించారు. విలువలతో కూడిన విద్య కోసం ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలతో ముద్రించిన పుస్తకాల గురించి వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న 'సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్'‌లోని టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫాం, షూ, స్కూల్ బ్యాగ్ వంటి వస్తువులను ప్రధాన్ పరిశీలించారు.

లీప్ డ్యాష్‌బోర్డుపై ప్రత్యేక ఆసక్తి

రాష్ట్ర విద్యాశాఖ పనితీరును పర్యవేక్షించేందుకు రూపొందించిన 'లీప్' డ్యాష్‌బోర్డును కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆసక్తిగా తిలకించారు. ఈ డ్యాష్‌బోర్డు ద్వారా విద్యార్థుల నమోదు, హాజరు, అభ్యసన ఫలితాలు, మధ్యాహ్న భోజన పథకం, డ్రాపౌట్లు, అధికారుల తనిఖీలు వంటి అనేక అంశాలను రియల్ టైంలో పర్యవేక్షించవచ్చని మంత్రి లోకేశ్ వివరించారు. 

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న స్మార్ట్ కిచెన్ల వ్యవస్థపై రూపొందించిన వీడియోను మంత్రులు వీక్షించారు. కడపలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన స్మార్ట్ కిచెన్ గురించి కేంద్ర మంత్రికి లోకేశ్ విశదీకరించారు. అనంతరం స్పోర్ట్స్ రూమ్, స్కిల్ ల్యాబ్‌లను సందర్శించి, అక్కడ విద్యార్థులు పైథాన్ లాంగ్వేజ్‌తో రూపొందించిన ఒక అప్లికేషన్‌ను పరిశీలించి అభినందించారు.

విద్యార్థులతో సరదాగా ముచ్చట్లు

అనంతరం మంత్రులిద్దరూ 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థుల మధ్య కూర్చున్నారు. 'ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా' అనే పాఠ్యాంశంపై రూపొందించిన క్లిక్కర్ వీడియోను వీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి విద్యార్థులతో సరదాగా సంభాషించారు. చాణక్య అనే విద్యార్థిని "చాణక్యుడు కింగా? కింగ్ మేకరా?" అని ప్రశ్నించగా, ఆ విద్యార్థి 'కింగ్ మేకర్' అని చురుగ్గా సమాధానమిచ్చాడు. మరో విద్యార్థిని పాఠ్యాంశాల్లో సందేహాలు వస్తే ఎవరిని అడుగుతావని ప్రశ్నించగా, తన సోదరుడిని అడుగుతానని చెప్పాడు. 

ఈ నేపథ్యంలో, విద్యార్థుల సౌలభ్యం కోసం బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్స్‌ను ప్రవేశపెట్టామని మంత్రి లోకేశ్ వివరించారు. విద్యార్థి స్థాయి ఆధారంగా బోధించే 'పాల్' ల్యాబ్‌ను కూడా మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా తమ పేర్లతో 3డీ ప్రింటింగ్‌తో రూపొందించిన బహుమతులను ఓ విద్యార్థి మంత్రులకు అందజేశాడు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు, జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు, ఇతర ఉన్నతాధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
Nara Lokesh
Dharmendra Pradhan
Andhra Pradesh Education Reforms
PM Shri AP Model School
LEAP Dashboard
Vizianagaram

More Telugu News