వరంగల్‌లో 'బంగారు' భూమి.. పసిడి కోసం పొలానికి క్యూ కడుతున్న జనం!
- వరంగల్ జిల్లాలో ఓ పొలంలో బయటపడ్డ పురాతన బంగారు ఆభరణాలు
- పత్తి చేనులో కలుపు తీస్తుండగా మహిళా కూలీలకు లభ్యం
- గతంలోనూ నిధులు దొరకడంతో భూమికి భారీగా పెరిగిన డిమాండ్
- బంగారం కోసం పొలంలో రాత్రిపూట జనాల గాలింపు
- నిధి తమదేనంటూ పాత యజమాని కుమారుడి ఫిర్యాదుతో కొత్త వివాదం
చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలోని ఈ ఆరెకరాల భూమిని పదేళ్ల క్రితం చెన్నారావుపేటకు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈర్యతండాకు చెందిన రైతు ఒకరు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నారు. జూన్ 24న వర్షాలు పడటంతో చేనులో కలుపు తీసేందుకు మహిళా కూలీలు పనికి వెళ్లారు. పని చేస్తుండగా, వారికి మట్టిలో నుంచి కొన్ని పురాతన బంగారు ఆభరణాలు లభించాయి. మొదట ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని ప్రయత్నించినా, ఊరంతా తెలియడంతో భూమి యజమాని దృష్టికి వెళ్లింది. ఆయన కూలీలను విచారించగా, వారు దొరికిన బంగారాన్ని అప్పగించారు. వెంటనే యజమాని ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు.
గతంలోనూ దొరికిన నిధులు
ఈ భూమిలో బంగారం దొరకడం ఇదే మొదటిసారి కాదని గ్రామస్థులు చెబుతున్నారు. శతాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయాలు ఉండేవని, కాలక్రమేణా అవి భూమిలో కలిసిపోయాయని స్థానికంగా ప్రచారంలో ఉంది. గతంలో పొలం దున్నుతున్నప్పుడు దేవతా విగ్రహాలు కూడా లభించాయని చెబుతున్నారు. 1991లో అప్పటి భూ యజమానికి వ్యవసాయ పనుల్లో భాగంగా పెద్ద మొత్తంలో బంగారం దొరికిందని, ఆ తర్వాత అదే పొలంలో పనిచేసిన పాలేరుకు కూడా కొన్ని బంగారు నాణేలు లభించాయని గ్రామస్థులు గుర్తు చేసుకుంటున్నారు. తాజా ఘటనతో ఈ భూమి కింద ఇంకా పెద్ద నిధి ఉందనే నమ్మకం బలపడింది.
కొత్తగా తెరపైకి పాత యజమాని వారసుడు
ఈ వ్యవహారం పోలీసుల వద్దకు చేరడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ఈ భూమిని గతంలో అమ్మేసిన పాత యజమాని కుమారుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది తమ తాతల కాలం నాటి భూమి అని, అందులో దొరికిన నిధిపై తమకే హక్కు ఉందని ఆయన వాదిస్తున్నారు. దొరికిన బంగారాన్ని పంచుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, ఆ నిధిని తమకు అప్పగించాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు.
రాత్రిపూట తవ్వకాలు
పొలంలో బంగారం దొరికిందనే వార్త చుట్టుపక్కల గ్రామాలకు వేగంగా వ్యాపించింది. దీంతో వందలాది మంది ప్రజలు ప్రతిరోజూ ఆ పొలానికి క్యూ కడుతున్నారు. పగలు పోలీసులు, రెవెన్యూ అధికారుల నిఘా ఉండటంతో, చాలామంది అర్ధరాత్రుళ్లు టార్చ్ లైట్లు, గునపాలతో పొలంలోకి ప్రవేశించి నిధి కోసం తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓవైపు నిధిపై హక్కుల వివాదం, మరోవైపు ప్రజల గాలింపు చర్యలతో ఈ బంగారు భూమి వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారింది.