పవన్ బాధ్యతలు చేపట్టగానే ఫిర్యాదు: రఘురామ సంచలన ప్రకటన

Raghu Rama Krishna Raju sensational announcement on filing complaint as Pawan Kalyan takes charge
  • పవన్ కల్యాణ్ హోం మంత్రి కాగానే జాడ శ్రవణ్ కుమార్‌పై ఫిర్యాదు చేస్తానన్న రఘురామ
  • తన నాలుక కోసి సమాధి కడతానని బెదిరించడం హత్యకు ప్రేరేపించడమేనని ఆరోపణ
  • రాజ్యాంగంలోని అంశాలను వక్రీకరించి మతపరమైన రంగు పులుముతున్నారని విమర్శ
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జాడ శ్రవణ్ కుమార్‌పై ఫిర్యాదు చేస్తానని రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. సోమవారం భీమవరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏలూరులో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో శ్రవణ్ కుమార్ తనపై చేసిన వ్యాఖ్యలను రఘురామ తీవ్రంగా ఖండించారు. తన నాలుక కోసి సమాధి కడతానని బెదిరించడం హత్యను ప్రేరేపించే క్రిమినల్ చర్య కిందకే వస్తుందని ఆయన మండిపడ్డారు. ఒక వర్గానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగ పరమైన అంశాలను తాను ప్రస్తావిస్తే.. వాటిని శ్రవణ్ కుమార్ వక్రీకరిస్తూ మతపరమైన రంగు పులుముతున్నారని ఆరోపించారు. తాను ఎన్నడూ ఏ మతాన్ని లేదా కులాన్ని కించపరిచేలా మాట్లాడలేదని రఘురామ వివరణ ఇచ్చారు.

ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణ ప్రాంగణంలో జనసేన నాయకులపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ, ఆ ఘటనకు మతపరమైన రంగు పులిమే ప్రయత్నాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను హోం మంత్రిని కాకపోవడం వల్లే నేరగాళ్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఇటీవల పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను రఘురామ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పవన్ హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించాకే ఈ అంశంపై ఫిర్యాదు చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ ప్రభుత్వం సుమోటోగా చర్యలు తీసుకోకపోయినా, తనపై ఉన్న అభిమానంతో ఎవరో ఒకరు తప్పకుండా ఫిర్యాదు చేస్తారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.                                
Raghu Rama Krishna Raju
Pawan Kalyan
Jada Shravan Kumar
Andhra Pradesh Home Ministry
Jai Bhim Bharat Party
AP Deputy Speaker

More Telugu News