షియా ముస్లింల నుంచి నాస్తికుడిగా.. ఆపై కిరాతకుడిగా: ఫయాజ్ ప్రేమ్‌జీ వెనుక సంచలన నిజాలు
- నిందితుడు పూణెకు చెందిన బీబీఏ గ్రాడ్యుయేట్
- షియా ముస్లిం నుంచి నాస్తికుడిగా మార్పు
- సోషల్ మీడియాలో ఇస్లాంపై తీవ్ర విమర్శలు
- ఇరాన్ వెళ్లినా మారని భావజాలం
- మొహర్రం జులూస్‌లో విషప్రయోగానికి ప్లాన్
పోలీసుల విచారణ ప్రకారం.. 39 ఏళ్ల ఫయాజ్ ప్రేమ్‌జీ పూణెకు చెందిన ఒక బీబీఏ గ్రాడ్యుయేట్. అతని తండ్రికి పూణెలో పెయింట్ కంపెనీ ఉంది. గుజరాత్, కచ్ ప్రాంత మూలాలున్న 'ఖోజా షియా' ముస్లిం సమాజానికి చెందిన ఫయాజ్.. 2015-16 ప్రాంతంలో ముంబైలోని కొందరు యువకులతో కలిసి తన కమ్యూనిటీలో సంస్కరణలు తేవాలంటూ ప్రచారం ప్రారంభించాడు. సంప్రదాయవాద ఇస్లామిక్ పద్ధతులను ప్రశ్నిస్తూ యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో క్రమంగా యాక్టివ్ అయ్యాడు.
అయితే, సమాజంలో సంస్కరణల కోసం అతడు చేసిన ప్రయత్నాలకు ఆదరణ లభించకపోగా, మత పెద్దల నుంచి వ్యతిరేకత ఎదురైంది. తనపై దాడులు జరిగాయని, సామాజిక బహిష్కరణకు గురయ్యానని పేర్కొంటూ 2019 నాటికి అతడు ఇస్లాం మతాన్ని పూర్తిగా విడిచిపెట్టాడు. తనను తాను ఒక నాస్తికుడిగా, 'ఎక్స్-ముస్లిం'గా ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత ఇస్లామిక్ దేశమైన ఇరాన్‌లో సంస్కరణలు ఉంటాయని భావించి అక్కడికి మారాడు. కానీ అక్కడ కూడా నిరాశే ఎదురవడంతో, ఆ మతంపై అతడిలో విద్వేషం మరింత పెరిగింది.
గత కొన్నేళ్లుగా పలు రైట్-వింగ్ పాడ్‌కాస్ట్‌లు, యూట్యూబ్ ఛానెళ్లలో షియా ఇస్లాం, ఇరాన్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తూలనాడుతూ ఫయాజ్ మాట్లాడేవాడు. ఆ ఆన్‌లైన్ విద్వేషమే ఇప్పుడు ప్రత్యక్ష దాడులకు దారితీసింది. మొహర్రం ఊరేగింపులో శారీరక హింస (రక్త తర్పణం) చేసుకునే భక్తులను లక్ష్యంగా చేసుకుని, వారు నొప్పి తెలియకుండా వేసుకునే పెయిన్ కిల్లర్స్ ఇవంటూ నమ్మించి.. జింక్ ఫాస్ఫైడ్ కెమికల్ కలిపిన 14,000 విషపు మాత్రలను పంపిణీ చేశాడు. ఒక భక్తుడు తీవ్రమైన వాంతులు, కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరడంతో ఈ భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. కేవలం ఆన్‌లైన్ విమర్శకుడిగానే కాకుండా సమాజంపై పగ తీర్చుకోవడానికి ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన ఫయాజ్ ప్రేమ్‌జీ వెనుక ఇంకెవరి హస్తమైనా ఉందా? అనే కోణంలో ముంబై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరం చేశారు.