పిల్లలను చంపేస్తామంటూ బెదిరింపులు.. సోషల్‌ మీడియాకు గుడ్‌బై చెప్పిన రాహుల్‌ రవీంద్రన్‌

Rahul Ravindran quits social media after death threats to his children
  • కేతన్‌ అగర్వాల్‌ కేసు చర్చతో వివాదం
  • రాహుల్‌ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో విమర్శలు
  • నోటిఫికేషన్లు చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యానన్న రాహుల్‌
  • తన మనసుపై అంత ప్రభావం చూపే అవకాశం ఇవ్వొద్దనే ‘ఎక్స్‌’ను వీడుతున్నట్లు వివరణ
సోషల్‌ మీడియాలో పెరుగుతున్న ద్వేషపూరిత వ్యాఖ్యలపై దర్శకుడు, నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన పిల్లలను చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో ‘ఎక్స్‌’ వేదికను పూర్తిగా వీడుతున్నట్లు ప్రకటించాడు.

ఇటీవల పూణెలో కేతన్‌ అగర్వాల్‌ హత్య చుట్టూ సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. ఓ నెటిజన్‌ రాహుల్‌ను ట్యాగ్‌ చేస్తూ మహిళల సమస్యలపై సినిమా తీసినట్లే పురుషులపై జరుగుతున్న అన్యాయాలపై కూడా తీస్తారా? అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన రాహుల్‌ సమాజంలో ఇప్పటికీ పితృస్వామ్య భావజాలం బలంగానే ఉందని అభిప్రాయపడ్డాడు.

ఆ వ్యాఖ్యల తర్వాత సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. కొందరు వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా, ఆయన కుటుంబాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. తన చిన్న పిల్లలను కూడా చంపేస్తామంటూ బెదిరిస్తామనడం తీవ్రంగా కలిచివేసిందని రాహుల్‌ వెల్లడించాడు. ఈ ఘటన తర్వాత ‘ఎక్స్‌’ను వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. నిజానికి చాలాకాలంగా ఆ వేదిక నుంచి బయటకు రావాలనుకున్నానని, కానీ క్రికెట్‌తో పాటు ఇతర క్రీడా వార్తల కోసం కొనసాగానని వివరించాడు.

బ్రెజిల్‌, జపాన్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూస్తున్న సమయంలో ‘ఎక్స్‌’ తెరిచానని రాహుల్‌ తెలిపారు. పొరపాటున నోటిఫికేషన్లు చూసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వాపోయాడు. అక్కడ కనిపించిన వ్యాఖ్యలు తనలో తీవ్ర కోపం, ఆవేదన కలిగించాయని చెప్పాడు. ఆ వ్యాఖ్యలు చదివిన తర్వాత తాను మారిపోయిన తీరు తనకే నచ్చలేదన్నాడు. ఏ సోషల్‌ మీడియా వేదికకూ తన మనసుపై అంత ప్రభావం చూపే అవకాశం ఇవ్వకూడదని భావించానన్నాడు.
Rahul Ravindran
Rahul Ravindran Quits X
Social Media Death Threats
Telugu Actor Director
Rahul Ravindran Patriarchy Comments
Social Media Toxicity

More Telugu News