నా సొంత స్థలాన్ని ఆక్రమించుకుని వైసీపీ కార్యాలయం కట్టారు: అశోక్ గజపతిరాజు

Ashok Gajapathi Raju says YSRCP built office by occupying his land
  • వైసీపీ హయాంలో తన ఆస్తిని ప్రభుత్వ భూమిగా మార్చారన్న అశోక్ గజపతిరాజు
  • అనుమతులు లేకుండా వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారని మండిపాటు
  • జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసహనం
గత వైసీపీ ప్రభుత్వం తన సొంత స్థలాన్ని అక్రమంగా లాక్కుందని గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు మండిపడ్డారు. రాత్రికి రాత్రే తన స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చేసి, అక్కడ వైసీపీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించారని తెలిపారు. 

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని... తన ప్రైవేట్ ఆస్తిని ప్రభుత్వ భూమిగా మార్చేశారని అన్నారు. అలా మార్చిన స్థలంలో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే మున్సిపల్ రూల్స్ బ్రేక్ చేస్తూ వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారని దుయ్యబట్టారు. దీనిపై గత సంవత్సరమే తాను విజయనగరం జిల్లా కలెక్టర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశానని తెలిపారు.

ఈ వ్యవహారంపై తాను ప్రశ్నిస్తే... గత జగన్ ప్రభుత్వం తిరిగి తనపైనే అనేక అక్రమ కేసులు నమోదు చేసి వేధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ఈ ల్యాండ్ స్కామ్‌ను పక్కదారి పట్టించేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని, తాము ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 


విజయనగరంలోని సదరు భూ రికార్డులపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తన తాత ముత్తాతల కాలం నాటి సొంత భూమిని కాపాడుకునేందుకు ఎంతటి న్యాయపోరాటం చేయడానికైనా సిద్ధమేనని అన్నారు.

Ashok Gajapathi Raju
YSRCP Land Grabbing
Vizianagaram Land Scam
Jagan Mohan Reddy
YCP Party Office
Land Encroachment Allegations

More Telugu News