ఫైనల్ చేరడం అర్జెంటీనాకు నల్లేరుపై నడకేనా?.. ఆసక్తి రేపుతున్న నాకౌట్ షెడ్యూల్!
- ఫిఫా ప్రపంచకప్ 2026లో ముగిసిన గ్రూప్ దశ.. టాప్ 32 జట్లు ఖరారు
- డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు ఫైనల్ వరకు సులువైన మార్గం
- సెమీస్ వరకు బలమైన ప్రత్యర్థులు ఎదురుపడని వైనం
- మరోవైపు డ్రాలో జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్ వంటి అగ్రశ్రేణి జట్లు
- రౌండ్ ఆఫ్ 16లోనే ఇంటిముఖం పట్టనున్న పలు కీలక జట్లు
గ్రూప్ స్టేజ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. కెప్టెన్ లియోనల్ మెస్సీ ప్రతి మ్యాచ్‌లో సగటున రెండు గోల్స్ చొప్పున సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అర్జెంటీనాతో పాటు 2018 విజేత ఫ్రాన్స్, ఆతిథ్య దేశాల్లో ఒకటైన మెక్సికో మాత్రమే గ్రూప్ దశలో వంద శాతం విజయాలు నమోదు చేశాయి. ఫ్రాన్స్ తరఫున కిలియన్ ఎంబాపె, ఉస్మాన్ డెంబెలె గోల్స్‌తో రాణించారు.
మరోవైపు, 2014 ఛాంపియన్ జర్మనీ తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఈక్వెడార్ చేతిలో ఓడిపోవడం నిరాశపరిచింది. టోర్నీని 7-1 భారీ విజయంతో ఆరంభించినప్పటికీ ఈ ఓటమి ఆ జట్టును దెబ్బతీసింది. బ్రెజిల్, పోర్చుగల్, ఇంగ్లండ్, యూరోపియన్ ఛాంపియన్ స్పెయిన్ వంటి జట్లు కూడా గ్రూప్ స్టేజ్ ప్రదర్శన పట్ల పూర్తి సంతృప్తితో లేవు.
అర్జెంటీనాకు ఫైనల్ దారి సుగమం
నాకౌట్ డ్రాను విశ్లేషిస్తే.. లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనాకు ఫైనల్ చేరేందుకు మార్గం చాలా సులువుగా కనిపిస్తోంది. రౌండ్ ఆఫ్ 32లో అర్జెంటీనా కేప్ వెర్డెతో తలపడనుంది. ఈ టోర్నీలో కేప్ వెర్డె కొన్ని సంచలనాలు సృష్టించినప్పటికీ, అర్జెంటీనాను ఓడించడం వారికి అతిపెద్ద సవాల్. ఈ మ్యాచ్‌లో గెలిస్తే, రౌండ్ ఆఫ్ 16లో ఈజిప్ట్ లేదా ఆస్ట్రేలియా విజేతతో అర్జెంటీనా ఆడుతుంది. ఈ రెండు జట్లు కూడా గ్రూప్ స్టేజ్‌లో సాధారణ ప్రదర్శనతోనే నాకౌట్‌కు చేరాయి.
ఇక క్వార్టర్ ఫైనల్స్‌లో అర్జెంటీనాకు స్విట్జర్లాండ్, కొలంబియా, ఘనా, లేదా అల్జీరియాలో ఒక జట్టు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నాలుగు జట్లతో పోలిస్తే అర్జెంటీనా స్పష్టమైన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. అంటే, సెమీ ఫైనల్స్ వరకు అర్జెంటీనాకు పెద్దగా గట్టి పోటీ ఎదురయ్యే సూచనలు కనిపించడం లేదు. సెమీస్‌లో బ్రెజిల్, నార్వే, ఐవరీ కోస్ట్, లేదా ఇంగ్లండ్ వంటి జట్లతో తలపడే అవకాశం ఉంది.
మరోవైపు యూరప్ జట్ల మధ్య హోరాహోరీ
అర్జెంటీనా ప్రయాణం ఒక ఎత్తు అయితే, షెడ్యూల్ బ్రాకెట్‌లో మరోవైపు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఫ్రాన్స్, పోర్చుగల్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్, బెల్జియం వంటి యూరోపియన్ దిగ్గజాలన్నీ ఒకే వైపు చేరాయి. దీంతో నాకౌట్ దశ ఆరంభంలోనే హోరాహోరీ పోరు ఖాయమైంది. రౌండ్ ఆఫ్ 16లోనే మాజీ ఛాంపియన్లు జర్మనీ, ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అంటే ఈ మ్యాచ్‌తో ఒక టాప్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయం. అదేవిధంగా, మరో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో స్పెయిన్, పోర్చుగల్ తలపడనున్నాయి. దీంతో ఈ రెండు జట్లలో కూడా ఒకటి ఇంటిముఖం పట్టక తప్పదు.
ఈ నేపథ్యంలో అర్జెంటీనా సెమీస్ వరకు పెద్దగా శ్రమించకుండానే చేరే అవకాశం ఉండగా, యూరోపియన్ జట్లు మాత్రం ఫైనల్ చేరాలంటే ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమ ఆటను ప్రదర్శించాల్సి ఉంటుంది. నాకౌట్ తొలి దశ నుంచే ఫైనల్‌ను తలపించే మ్యాచ్‌లు జరగనుండటంతో ఈ ప్రపంచకప్‌పై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి.