'నాతో ఇల్లు తుడిపించారు.. గిన్నెలు కడిగించారు’.. ఆత్మహత్యకు ముందు యువకుడి సెల్ఫీ వీడియో!

Rahul selfie video reveals harassment by wife and in-laws before suicide
  • ఫరీదాబాద్‌లో వస్త్ర వ్యాపారి ఆత్మహత్య
  • ఆత్మహత్యకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్ఫీ వీడియో
  • భార్య, అత్తమామల వేధింపులే కారణమని ఆరోపణ
  • వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు
భార్య, అత్తమామల మానసిక వేధింపులు తట్టుకోలేక ఒక వస్త్ర వ్యాపారి తన దుకాణంలోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు కొన్ని నిమిషాల ముందు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన ఒక సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. తన చావుకు భార్య జ్యోతి, అత్త వీణ, మామ బిట్టు, మరదలు నీతూలే కారణమని బాధిత యువకుడు ఆ వీడియోలో ఆరోపించాడు.

పోలీసుల కథనం ప్రకారం.. హర్యానాకు చెందిన 28 ఏళ్ల రాహుల్ నాలుగు నెలల క్రితమే ఫరీదాబాద్‌లో సొంతంగా ఒక గార్మెంట్ షాప్‌ ప్రారంభించాడు. రెండేళ్ల క్రితం జ్యోతి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొన్ని రోజులకే భార్య తన తల్లిదండ్రులతో కలిసి ఉండనని గొడవ చేయడంతో రాహుల్ వేరు కాపురం పెట్టాల్సి వచ్చింది. ఇన్‌స్టా వీడియోలో రాహుల్ తన ఆవేదనను వ్యక్తంచేస్తూ.. "నేను ఇంట్లో ఊడ్చడం, గిన్నెలు కడగడం లాంటి పనులన్నీ చేసినప్పటికీ నన్ను వేధించేవారు. నాపై భౌతికంగా దాడులు చేయడమే కాకుండా నాపై తప్పుడు కేసులు పెట్టారు. నన్ను నా తల్లిదండ్రులను కూడా కలవనివ్వకుండా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేశారు" అని కన్నీరు పెట్టుకున్నాడు. తన చావుకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తన మరణానంతరం తన ఆస్తి మొత్తం తన తల్లి, సోదరి, సోదరులకే చెందాలని రాహుల్ ఆ వీడియోలో కోరాడు.

ఆదివారం దుకాణంలో రాహుల్ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్నఅధికారులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన రాహుల్ సెల్ఫీ వీడియోను స్వాధీనం చేసుకున్నామని, దాని ఆధారంగానే కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.  
Rahul
Faridabad suicide case
Haryana garment merchant death
Instagram selfie video suicide
Marital harassment allegations
Rahul suicide viral video

More Telugu News