మిస్సయిన ఎగ్జిట్ కోసం కారు రివర్స్.. స్కోర్పియో ఢీకొని ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Delhi Dehradun Expressway accident four of family killed as car reverses for missed exit
  • ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం
  • ఎగ్జిట్ మిస్ అయి రివర్స్ తీసుకుంటున్న కారును ఢీకొట్టిన ఎస్‌యూవీ
  • హరిద్వార్ వెళ్తుండగా సహారన్‌పూర్ వద్ద ఘటన
  • ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్
ప్రముఖ పుణ్యక్షేత్రం హరిద్వార్‌లో పవిత్ర గంగానది స్నానాలు ఆచరించి, దేవాలయాలను దర్శించుకోవాలని బయలుదేరిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ప్రయాణం విషాదంగా ముగిసింది. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఎగ్జిట్ రూట్ దాటిపోవడంతో డ్రైవర్ చేసిన ఒక చిన్న పొరపాటు.. నాలుగు ప్రాణాలను బలితీసుకుంది. కారును హైవేపై రివర్స్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన స్కార్పియో ఎస్‌యూవీ బలంగా ఢీకొట్టడంతో తొమ్మిదేళ్ల చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ భయానక ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లా హల్గోయా కట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హర్యానాలోని బహదూర్‌గఢ్‌కు చెందిన ప్రవీణ్ (40), ఆయన భార్య ప్రీతి (37), తల్లి సుదేశ్, 9 ఏళ్ల కుమారుడు శివాంశ్ మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి కారులో హరిద్వార్ బయలుదేరారు. మార్గమధ్యంలో ఎక్స్‌ప్రెస్‌వేపై వారు దిగాల్సిన ఎగ్జిట్ పాయింట్‌ను డ్రైవర్ గమనించకుండా ముందుకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పొరపాటును గమనించి కారును రివర్స్ చేస్తుండగా సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన స్కార్పియో వాహనం కారును బలంగా ఢీకొట్టి కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది.

ఈ ఘోర ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న ప్రవీణ్, ప్రీతి, సుదేశ్, చిన్నారి శివాంశ్ ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, తోటి వాహనదారులు వెంటనే స్పందించి గాయపడిన వారిని రక్షించే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ అరవింద్ కుమార్ చౌహాన్, ఎస్పీ అభినందన్ ఆసుపత్రికి చేరుకుని బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.  
Delhi Dehradun Expressway
Saharanpur road accident
Car reversing mishap
Haridwar family tragedy
Scorpio car collision
Uttar Pradesh highway accident

More Telugu News