ఏపీ డిజిటల్ భవిష్యత్తుపై చంద్రబాబు ఫోకస్.. సునీల్ మిట్టల్‌తో కీలక భేటీ
- చంద్రబాబుతో భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్ భేటీ
- రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలపై కీలక చర్చలు
- డేటా సెంటర్లు, కనెక్టివిటీ, అండర్ సీ కేబుల్‌పై ప్రధానంగా దృష్టి
- చర్చలు ఫలప్రదంగా సాగాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ఈ భేటీలో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సునీల్ మిట్టల్‌తో జరిగిన చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతం, పౌరులకు మెరుగైన కనెక్టివిటీని అందించడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగాయి’’ అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
మరోవైపు, విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టులో భారతీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఎయిర్టెల్ నెక్స్ట్రా ఇప్పటికే భాగస్వామిగా ఉంది. భారీ పెట్టుబడులతో, స్వచ్ఛ ఇంధనంతో నడిచేలా రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2026 ఏప్రిల్‌లో శంకుస్థాపన చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ప్రాజెక్టును 2028 సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకే భాగస్వామ్య సంస్థలను కోరారు.