గాడిద, మేక పాలు తాగి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆదోని ఎమ్మెల్యే!
- ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి వినూత్న పర్యటన
- వీధిలో అమ్ముతున్న గాడిద పాలు కొని తాగిన వైనం
- స్వయంగా మేక పాలు పితికి అక్కడే సేవించిన ఎమ్మెల్యే
- మేక, గాడిద పాలు ఆరోగ్యానికి శ్రేష్టమన్న పార్థసారథి
‘ప్రజల కోసం మీ ఎమ్మెల్యే’ పేరుతో పార్థసారథి పట్టణంలోని వివిధ కాలనీల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో అరుణ్ జ్యోతి నగర్లో పర్యటిస్తుండగా, గాడిద పాలు అమ్ముతున్న ఒక వ్యక్తిని చూసి ఆప్యాయంగా పలకరించారు. అతని వ్యాపారం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అతని వద్ద గాడిద పాలను కొనుగోలు చేసి అక్కడికక్కడే తాగారు.
ఆ తర్వాత మహాత్మా గాంధీ నగర్లో పర్యటిస్తున్నప్పుడు, మేకల కాపరి శివన్నను చూసి ఆయన వద్దకు వెళ్లారు. అతని జీవన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం తానే స్వయంగా ఒక మేక పాలు పితికి తాగారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. "గాడిద, మేక పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పాలు తాగితే శరీరంలోని అవయవాలు శుద్ధి అవుతాయని చెబుతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ పాలు అమ్ముతూ జీవనోపాధి పొందుతున్న ఈ యువకుడిని అభినందిస్తున్నాను" అని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునే పర్యటనలో ఎమ్మెల్యే ఇలా సామాన్యులతో కలిసిపోవడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది.