పరిస్థితులు మారాయి.. ఇప్పుడు సంతానం భారం కాదు.. సంపద: సీఎం చంద్రబాబు
- జాతీయ ఇమ్యునైజేషన్ డేలో భాగంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం
- ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పునరుద్ధరణ కావాలని ఆకాంక్షించిన చంద్రబాబు
- పిల్లల పెంపకంలో తండ్రులు కూడా బాధ్యత పంచుకోవాలని సూచన
- సంతానాన్ని భారంగా కాకుండా సంపదగా చూడాలన్న ముఖ్యమంత్రి
- రాష్ట్రవ్యాప్తంగా 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కల లక్ష్యం
అనంతరం ముఖ్యమంత్రి చిన్నారుల తల్లిదండ్రులతో ఆప్యాయంగా ముచ్చటించారు. పిల్లలను ఎత్తుకుని ఆడించారు. వారి ఆరోగ్య వివరాలు, వ్యాక్సినేషన్ షెడ్యూల్ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయంలో తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం అమలుకు చేసిన ఏర్పాట్లను కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 5 ఏళ్లలోపు వయసున్న సుమారు 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఉద్యోగాలు చేసే మహిళలు పిల్లల పెంపకాన్ని ఎలా సమన్వయం చేసుకుంటున్నారని అడిగారు. "పిల్లల్ని కని, పెంచడం, వారి ఆలనా పాలనా చూడటం ఒక్క తల్లికి మాత్రమే పరిమితం చేయకూడదు. ఇంట్లో భర్త, ఇతర మగవాళ్లు కూడా పిల్లల పెంపకంలో బాధ్యత తీసుకోవాలి" అని ఆయన స్పష్టం చేశారు.
గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండటం వల్ల పిల్లల పెంపకంలో అందరూ భాగస్వాములయ్యేవారని గుర్తుచేశారు. పిల్లలను విలువలతో పెంచడంలో నానమ్మ, తాతయ్యలు కీలక పాత్ర పోషించేవారని అన్నారు.
"ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చాలా బలమైనది. అలాంటి వ్యవస్థ మళ్లీ రావాలి. సంతానాన్ని ఒక సమస్యగా, భారంగా చూసే విధానం పోవాలి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. సంతానం అంటే సంపద అనే పరిస్థితి వస్తోంది. అందుకే ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండేలా ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సహిస్తున్నాం" అని చంద్రబాబు వివరించారు. ఈ విషయంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కేవీఎన్ చక్రధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు, జాతీయ ఆరోగ్య మిషన్ సిబ్బంది పాల్గొన్నారు.





