బంగారంపై కొత్త రూల్స్.. సౌదీకి వెళ్లే ముందు ఇది తెలుసుకోండి!
- సౌదీ అరేబియా ప్రయాణికుల కోసం బంగారం డిక్లరేషన్ నిబంధనలు కఠినతరం
- డిక్లరేషన్ పరిమితిని 60,000 రియాల నుంచి 40,000 రియాలకు తగ్గింపు
- సుమారు రూ.10 లక్షల విలువైన బంగారం, ఆభరణాలు ఉంటే డిక్లరేషన్ తప్పనిసరి
- నియమాలు ఉల్లంఘిస్తే వస్తువుల విలువలో 50శాతం వరకు జరిమానా
- మనీ లాండరింగ్ నిరోధానికి దేశవ్యాప్తంగా సౌదీ ప్రభుత్వం చర్యలు
'ఒకాజ్' అనే అరబిక్ దినపత్రిక కథనం ప్రకారం.. ఇకపై సౌదీ అరేబియాలోకి ప్రవేశించే లేదా దేశం విడిచి వెళ్లే ప్రయాణికులు తమ వద్ద 40,000 రియాలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన బంగారం కడ్డీలు, విలువైన లోహాలు, రత్నాలు లేదా ఆభరణాలు ఉంటే, తప్పనిసరిగా కస్టమ్స్‌కు రాతపూర్వక డిక్లరేషన్ సమర్పించాలి. అంతేగాక ఆ వస్తువుల విలువను నిర్ధారించేందుకు కొనుగోలు ఇన్వాయిస్ను కూడా చూపించాల్సి ఉంటుంది.
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
కొత్త నిబంధనల ప్రకారం, ఎవరైనా తమ వద్ద ఉన్న బంగారం లేదా నగదు వివరాలను వెల్లడించడంలో విఫలమైతే, లేదా వారిపై మనీ లాండరింగ్ అనుమానాలు తలెత్తితే, ఆ వస్తువులను 72 గంటల వరకు స్వాధీనం చేసుకునే అధికారాన్ని జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ (జెడ్ఏటీసీఏ)కి కల్పించారు. మొదటిసారి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మనీ లాండరింగ్ అనుమానం లేనట్లయితే, స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువలో 10 నుంచి 25 శాతం వరకు జరిమానా విధిస్తారు. అదే తప్పు మళ్లీ చేస్తే, జరిమానా 50 శాతానికి పెరుగుతుంది. ఒకవేళ ఆర్థిక నేరాలకు సంబంధించిన అనుమానాలు ఉంటే, ఆ కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ విభాగానికి బదిలీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
మనీ లాండరింగ్‌పై ఉక్కుపాదం
ఈ నిబంధనల మార్పు, సౌదీ అరేబియా చేపట్టిన విస్తృత మనీ లాండరింగ్ నిరోధక చర్యలలో ఒక భాగం. ఇందులో భాగంగా ఆర్థిక సంస్థలు, ఇతర వ్యాపారాలు తమ కస్టమర్లు, ఉత్పత్తులు, లావాదేవీలకు సంబంధించిన మనీ లాండరింగ్ రిస్క్‌లను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. కస్టమర్ల గుర్తింపును ధ్రువీకరించడం, 25 శాతానికి పైగా వాటా ఉన్న కంపెనీల అసలు యజమానులను గుర్తించడం, నిధుల మూలాలను తెలుసుకోవడం తప్పనిసరి చేశారు. సరైన సమాచారం ఇవ్వని పక్షంలో లావాదేవీలను నిరాకరించే లేదా సంబంధాలను రద్దు చేసుకునే అధికారాన్ని సంస్థలకు ఇచ్చారు.
అలాగే, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు వంటి రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తుల విషయంలో మరింత కఠినమైన తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలన్నింటిలోనూ డబ్బు పంపేవారి, స్వీకరించేవారి పూర్తి సమాచారం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. అనుమానాస్పద లావాదేవీలను ఏడు పనిదినాల వరకు నిలిపివేయడం, మనీ లాండరింగ్ కేసులతో సంబంధం ఉన్న ఆస్తులను స్తంభింపజేయడం వంటి అధికారాలను కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ విభాగానికి కల్పించారు. ఈ చర్యల ద్వారా దేశంలో ఆర్థిక పారదర్శకతను పెంచి, అక్రమ రవాణా ప్రవాహాలను అరికట్టాలని సౌదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.