టెన్నిస్ కోర్ట్ నుంచి బోర్డ్‌రూమ్‌కు.. జొకోవిచ్ కొత్త ఇన్నింగ్స్

Novak Djokovic New Innings From Tennis Court to Boardroom
  • ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్‌కు గ్లోబల్ అడ్వైజర్‌గా జొకోవిచ్
  • సంస్థ నాయకత్వం, భాగస్వామ్య కంపెనీలతో కలిసి పనిచేయనున్న టెన్నిస్ స్టార్
  • ఆరోగ్యం, వెల్నెస్ రంగంలో విస్తరించేందుకు ఉపయోగప‌డ‌నున్న‌ జొకోవిచ్ అనుభవం 
  • రికార్డుస్థాయి 25వ గ్రాండ్‌స్లామ్ లక్ష్యంతో వింబుల్డన్ బరిలోకి దిగనున్న తరుణంలో ఈ నియామకం
  • క్రీడల్లోని క్రమశిక్షణే వ్యాపారంలోనూ విజయానికి మూలమని వ్యాఖ్య
టెన్నిస్ ప్రపంచంలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న నొవాక్ జొకోవిచ్, ఇప్పుడు వ్యాపార ప్రపంచంలోకి ఓ కీలక అడుగు వేశారు. ప్రఖ్యాత గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ 'జనరల్ అట్లాంటిక్'కు గ్లోబల్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా వింబుల్డన్ బరిలోకి దిగడానికి కొద్ది రోజుల ముందు ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ కొత్త బాధ్యతల్లో భాగంగా జొకోవిచ్... జనరల్ అట్లాంటిక్ సంస్థ నాయకత్వ బృందంతో, దాని పోర్ట్‌ఫోలియో కంపెనీలతో, పెట్టుబడిదారులతో కలిసి పనిచేస్తాడు. ముఖ్యంగా నాయకత్వ పటిమ, స్థితిస్థాపకత, ఆవిష్కరణలు వంటి అంశాలపై తన అనుభవాలను, దృక్పథాన్ని పంచుకోనున్నాడు. ఈ నియామకం ద్వారా జొకోవిచ్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని, ముఖ్యంగా హెల్త్, వెల్నెస్ రంగంలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించాలని జనరల్ అట్లాంటిక్ భావిస్తున్నట్లు 'బ్లూమ్‌బెర్గ్' తన కథనంలో పేర్కొంది.

ఇటీవలి కాలంలో జొకోవిచ్ వ్యాపార రంగంలో తన పెట్టుబడులను విస్తరిస్తున్నాడు. 2023లో వెల్నెస్ బ్రాండ్ 'వాటర్‌డ్రాప్'లో పెట్టుబడి పెట్టిన టెన్నిస్ స్టార్‌, 2024లో 'SILA' అనే సప్లిమెంట్ కంపెనీని సహ-స్థాపించాడు. 2025లో 'కాబ్ ఫుడ్స్' అనే స్నాక్ ఫుడ్ సంస్థను ప్రారంభించడంతో పాటు 'ఇంక్రిడివేర్' అనే వేరబుల్స్ కంపెనీకి కూడా మద్దతుగా నిలిచాడు.

ఈ నియామకంపై జొకోవిచ్ స్పందిస్తూ.. "క్రీడల్లో అత్యున్నత స్థాయిలో రాణించడానికి అవసరమైన సూత్రాలే, గొప్ప వ్యాపారాలను నిర్మించడానికి కూడా వర్తిస్తాయి. క్రమశిక్షణ, దీర్ఘకాలిక ఆలోచనా విధానం, నిరంతరం మెరుగుపడాలనే తపన ఇరు రంగాల్లోనూ కీలకం. బిల్, ఆయన బృందం నిర్మిస్తున్న ఈ సంస్థ ప్రగతిలో భాగం పంచుకోవడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని తెలిపాడు.

15 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ప్లేయ‌ర్‌గా మారిన జొకోవిచ్, టెన్నిస్ చరిత్రలోనే గొప్ప ఆటగాడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. తన కెరీర్‌లో రికార్డు స్థాయిలో 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు, ట్రిపుల్ కెరీర్ గ్రాండ్‌స్లామ్, పారిస్ 2024 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో కెరీర్ సూపర్ స్లామ్ సాధించాడు. అంతేకాకుండా ఆల్-టైమ్ రికార్డుగా 428 వారాల పాటు వరల్డ్ నంబర్ 1 ర్యాంకులో కొనసాగడం, రికార్డు స్థాయిలో 8 సార్లు ఇయర్-ఎండ్ నంబర్ 1గా నిలవడం, అపూర్వంగా 40 ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిళ్లను గెలుచుకోవడం వంటి ఘనతలతో గ్లోబల్ స్పోర్ట్స్ ఐకాన్‌గా తన వారసత్వాన్ని పదిలపరుచుకున్నాడు. ఆటలో జొకోవిచ్ ప్రదర్శించిన మానసిక దృఢత్వం, క్రమశిక్షణే ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలోనూ అత‌నికి మార్గనిర్దేశం చేయనున్నాయి.
Novak Djokovic
General Atlantic
Global Strategic Advisor
Novak Djokovic Business Investments
Tennis Star Corporate Role
Health and Wellness Sector

More Telugu News