ఏంటీ ‘జూన్‌ థియరీ’?.. ఈ నెలలో ప్రేమ ఖాయమంటూ నెటింట్లో వైరల్‌!

June Theory viral social media trend claims love is certain this month
  • జూన్‌ థియరీపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ
  • ఈ నెలలో కొత్తగా ప్రేమ పుడుతుందని ప్రచారం
  • లేదా ఎక్స్‌ నుంచి మెసేజ్‌ వస్తుందని ఊహాగానాలు
  • శాస్త్రీయ ఆధారాలు లేవంటున్న నిపుణులు
  • ఆశావహ దృక్పథమే ఈ థియరీకి బలం అంటున్న ఎక్స్‌పర్ట్స్‌
ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. అలాగే ఎప్పుడో దూరమైన వ్యక్తి మళ్లీ జీవితంలోకి ఎప్పుడు వస్తారో కూడా చెప్పలేం. కానీ ప్రతి ఏడాది జూన్‌లో మాత్రం కొత్త ప్రేమ మొదలవడమో.. లేక పాత భాగస్వామి నుంచి అనుకోకుండా మెసేజ్‌ రావడమో జరుగుతుంది అంటూ ఓ థియరీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీన్నే ‘జూన్‌ థియరీ’ అంటున్నారు.

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌, టిక్‌టాక్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల్లో ‘జూన్‌ థియరీ’పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీని ప్రకారం జూన్‌ నెలలో చాలా మందికి కొత్త ప్రేమ పరిచయం అవడమో... లేదంటే చాలా కాలంగా మాట్లాడని మాజీ ప్రియుడు లేదా మాజీ ప్రియురాలు అకస్మాత్తుగా సంప్రదిస్తారని నమ్ముతున్నారు.

ఈ నమ్మకానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా.. జూన్‌లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చాలామంది తమ కథలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. కొందరు ఈ నెలలోనే తమ ప్రేమ మొదలైందని చెబుతుండగా.. మరికొందరు నెలల తరబడి, ఏళ్ల తరబడి మాట్లాడని మాజీ భాగస్వామి నుంచి ఒక్కసారిగా మెసేజ్‌ వచ్చిందని అంటున్నారు.

ఎందుకు జూన్‌?
నిపుణుల అభిప్రాయం ప్రకారం దీనికి ప్రధాన కారణం వాతావరణం, జీవనశైలిలో వచ్చే మార్పులే. జూన్‌లో సెలవులు, విహారయాత్రలు, పెళ్లిళ్లు, స్నేహితుల సమావేశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో కొత్త వ్యక్తులను కలిసే అవకాశాలు పెరుగుతాయి. మనుషులు కూడా సాధారణ రోజుల కంటే ఎక్కువగా బయటకు వెళ్లడం, కొత్త పరిచయాలకు సిద్ధంగా ఉండటం వల్ల ప్రేమకు అవకాశం పెరుగుతుందని చెబుతున్నారు.

ఎక్స్‌లు ఎందుకు గుర్తొస్తారు?
వేసవి కాలంలో చాలామంది పాత ఫొటోలు చూడడం, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం, ఖాళీ సమయం ఎక్కువగా ఉండడం వల్ల గత సంబంధాల గురించి ఆలోచించే అవకాశం పెరుగుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. దీంతో కొందరు తమ మాజీ భాగస్వామికి మళ్లీ మెసేజ్‌ పంపే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.

నిపుణులు ఏమంటున్నారు?
రిలేషన్‌షిప్‌ సైకాలజిస్టుల ప్రకారం ‘జూన్‌ థియరీ’కి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే ఈ నెలలో ఎక్కువ మంది పాజిటివ్‌గా ఉండటం, కొత్త పరిచయాలకు ముందుకు రావడం, ఆహ్వానాలు స్వీకరించడం వంటి కారణాలతో కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు సహజంగానే పెరుగుతాయి. అలాగే ‘ఈ నెలలో ఏదో మంచి జరుగుతుంది’ అనే నమ్మకం కూడా వ్యక్తుల ప్రవర్తనను ప్రభావితం చేసి కొత్త అవకాశాలను సృష్టించవచ్చని వారు చెబుతున్నారు.
June Theory
Relationship Trends
Social Media Viral
Dating Psychology
Ex Partners
Summer Romance

More Telugu News