వెలిగొండకు నేనే శంకుస్థాపన చేశా.. పూర్తిచేసే బాధ్యత కూడా నాకే వచ్చింది: సీఎం చంద్రబాబు
- మార్కాపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన
- 'సంజీవని' ఆరోగ్య కార్యక్రమం ప్రారంభం
- వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదేనని ప్రజలకు హామీ
- గత పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని వెల్లడి
- ప్రకృతి వ్యవసాయంతోనే రైతులకు మేలని, యువత టెక్నాలజీపై దృష్టి పెట్టాలని పిలుపు
ప్రాజెక్టు పూర్తికి ఇంకా రూ.3,900 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉందని చంద్రబాబు వివరించారు. పునరావాసం కింద నిర్వాసితులకు ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేశామని, త్వరలోనే మరో రూ.600 కోట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. మొదటి విడతలో 1.19 లక్షల ఎకరాలకు, ఆ తర్వాత మిగిలిన ప్రాంతానికి పరిహారం చెల్లింపులు పూర్తి చేస్తామని తెలిపారు. కొందరు గొడ్డలి పార్టీకి పరోక్షంగా పనిచేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
ఆగస్టు 15 నుంచి ‘సంజీవని’
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం రూపొందించిన 'సంజీవని' కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇది ఒక సమగ్ర డిజిటల్ ఆరోగ్య వేదిక అని, దీని ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ సేవల వరకు మొత్తం ఆరోగ్య వ్యవస్థను అనుసంధానం చేస్తామని వివరించారు.
ప్రెడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానాలతో ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామని, సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులను భద్రపరుస్తామని తెలిపారు. ప్రజలు కూడా మంచి ఆహారం, వ్యాయామం, యోగా వంటి అలవాట్లతో ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
బ్లేడు, గంజాయి బ్యాచ్‌లు రాబందుల్లా తిరిగాయి!
గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయని చంద్రబాబు ఆరోపించారు. నలుగురు వ్యక్తులు స్వేచ్ఛగా మాట్లాడుకోలేని భయానక వాతావరణం ఉండేదని, బ్లేడు, గంజాయి బ్యాచ్‌లు రాబందుల్లా తిరిగాయని విమర్శించారు. నేడు ఆ పరిస్థితి మారిందని, ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని అన్నారు.
రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడ్డాయని స్పష్టం చేశారు.
మహిళల కోసం స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2.0 వంటి పథకాలను అమలు చేస్తున్నామని, వచ్చే నెలలో 'తల్లికి వందనం' కింద తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని తెలిపారు. రైతుల కోసం మొదటి విడత నిధులు ఇప్పటికే విడుదల చేశామని గుర్తుచేశారు.
యువత, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
రామాయపట్నం పోర్టును త్వరలోనే పూర్తి చేసి, పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చి, పండ్ల తోటలు, వాణిజ్య పంటలను ప్రోత్సహించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రైతులు విచ్చలవిడిగా పురుగుమందులు వాడటం వల్ల మన ఉత్పత్తులు అంతర్జాతీయంగా తిరస్కరణకు గురవుతున్నాయని, అందుకే ప్రకృతి సేద్యం వైపు మళ్లాలని సూచించారు.
యువత ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలు నేర్చుకొని భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జనాభా తగ్గుదల వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని, ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు డీబీవీ స్వామి, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.