ప్రెగ్నెన్సీ తర్వాత 20 కేజీలు తగ్గింది.. ఆమె సీక్రెట్ ఇదే!
- ప్రెగ్నెన్సీతో 30 కిలోల బరువు పెరిగిన ఘజల్ అలఘ్
- డెలివరీ తర్వాత బరువు 84 కిలోలకు చేరినట్లు వెల్లడి
- క్రమంగా 20 కిలోలు తగ్గి 63-64 కిలోలకు చేరిక
- బరువు తగ్గడంలో 80 శాతం పాత్ర ఆహారానిదేనని వ్యాఖ్య
- మిగిలిన 20 శాతం మాత్రమే వ్యాయామం అని స్పష్టం
ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేటర్ గుంజన్ తనేజాతో జరిగిన సంభాషణలో ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ షూటింగ్లో పాల్గొన్నానని, అప్పటికే తన సాధారణ బరువు కంటే 28 కిలోలు ఎక్కువగా ఉన్నానని చెప్పారు.
డెలివరీ తర్వాత మన బరువు నుంచి బిడ్డ వెయిట్ మాత్రమే తగ్గుతుందని ఘజల్ అలఘ్ వెల్లడించారు. మిగిలిన బరువు అలాగే ఉండిపోతుందని పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రసవం జరిగిన మూడు నెలల తర్వాత తన బరువు 83-84 కిలోలకు చేరినట్లు వెల్లడించారు.
ఆ తర్వాత క్రమంగా జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ముందుగా 70 కిలోలకు, చివరకు 63-64 కిలోలకు చేరుకున్నానని చెప్పారు. మొత్తంగా దాదాపు 20 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు. ఈ ప్రయాణంలో తనకు ఆహారమే కీలక పాత్ర పోషించిందని ఘజల్ చెప్పారు. ‘‘బరువు తగ్గడంలో 80 శాతం పాత్ర మనం తినే ఆహారానిదే. మిగిలిన 20 శాతం మాత్రమే శారీరక కదలికలు, వ్యాయామంపై ఆధారపడి ఉంటుంది’’ అని వివరించారు.
త్వరగా ఫలితాలు రావాలనే ఆలోచనతో కాకుండా.. శరీరానికి అవసరమైన పోషకాహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకోవడం, రోజూ చురుగ్గా ఉండడంపైనే తాను దృష్టి పెట్టానని తెలిపారు. ప్రసవానంతరం బరువు తగ్గాలనుకునే మహిళలు తొందరపడకుండా.. దీర్ఘకాలిక ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.