ఏపీకి తమిళనాడు సీఎం విజయ్?.. కాకినాడ హోర్డింగ్ వెనుక అసలు కథేంటి?

Vijay Tamil Nadu CM to visit AP What is the truth behind Kakinada hoarding
  • తమిళనాడు సీఎం విజయ్ ఏపీకి వస్తున్నారంటూ ప్రచారం
  • కాకినాడలోని ఓ కాలేజీ వద్ద వెలసిన స్వాగత హోర్డింగ్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • పర్యటనపై అటు సీఎంవో, ఇటు కాలేజీ నుంచి లేని స్పష్టత
  • ఇది కాలేజీ మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చని అనుమానాలు
తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ ఏపీ పర్యటనకు రాబోతున్నారా? కాకినాడలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇది. విజయ్‌కు స్వాగతం పలుకుతూ కాకినాడలో ఏర్పాటు చేసిన ఓ హోర్డింగ్ వీడియో గత రెండు రోజులుగా ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ పర్యటనపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడకపోవడంతో ఇందులో నిజమెంత అనే దానిపై తీవ్ర గందరగోళం నెలకొంది.

సోషల్ మీడియాలో వైరల్ వీడియో
గత రెండు రోజులుగా 12 సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైర‌ల్‌ అవుతోంది. "తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను ఆహ్వానిస్తున్నాము" అంటూ కాకినాడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (KIET) పేరుతో ఈ హోర్డింగ్ ఉంది. ఆ హోర్డింగ్ పరిసరాల్లో ఉన్న దుకాణాల పేర్లు తెలుగులో ఉండటంతో ఇది కచ్చితంగా ఏపీలోనిదేనని నెటిజన్లు నిర్ధారించుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ తొలిసారి ఏపీకి వస్తున్నారంటూ ఆయన అభిమానులు, నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అధికారిక ప్రకటన ఏదీ?
ఈ వీడియో వైరల్ కావడంతో విజయ్ నిజంగానే కాకినాడ వస్తున్నారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే, ఈ పర్యటన గురించి తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి గానీ, సదరు కళాశాల యాజమాన్యం నుంచి గానీ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పర్యటన ఖరారైతే, కొన్ని రోజుల ముందే అధికారిక షెడ్యూల్ విడుదలవుతుంది. కానీ, విజయ్ పర్యటన విషయంలో అలాంటి సమాచారం ఏదీ లేకపోవడంతో ఇది కేవలం ప్రచారమేనా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇది కేవలం కళాశాల ప్రచారం కోసం అనుసరిస్తున్న మార్కెటింగ్ వ్యూహంలో భాగమేమోనని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఏపీలో విజయ్‌కు మంచి ఫాలోయింగ్
నటుడిగా విజయ్‌కు ఏపీలో కూడా బలమైన అభిమాన గణం ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ భారీ వసూళ్లను సాధిస్తుంటాయి. ఆయన సీఎం అయినప్పుడు కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన ఏపీకి వస్తున్నారనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.

మొత్తం మీద సీఎం విజయ్ ఏపీ పర్యటనపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడాలంటే కాకినాడ 'కైట్' కళాశాల యాజమాన్యం స్పందించాల్సి ఉంది. వారి నుంచి అధికారిక ప్రకటన వెలువడితేనే ఈ ప్రచారంలో ఉన్న వాస్తవాలు బయటకు వస్తాయి.
Vijay
Tamil Nadu CM Vijay AP Visit
Kakinada KIET College Hoarding
Vijay Kakinada Viral Video
Thalapathy Vijay Political News
KIET Engineering College Kakinada

More Telugu News