ఈ 5 మొక్కలు పెంచుతున్నారా?.. ఇంట్లోకి పాములు వచ్చే ప్రమాదం!
- దట్టమైన పొదలు, నీడ ఉన్న ప్రదేశాలే పాములకు ఆశ్రయం
- వెదురు మొక్కలు పాములకు దాచుకునే అనువైన స్థలం
- పెరివింకిల్, ఐవీ తీగల కింద తేమ, ఆకుల పేరుకుపోతాయి
- లెమన్‌గ్రాస్, మల్లె పొదల్లో చిన్న జీవుల సంచారం
- గంధపు చెట్ల కింద చల్లటి వాతావరణం
- తోటను శుభ్రంగా ఉంచితే పాములు వచ్చే ప్రమాదం తగ్గే అవకాశం
పాములు తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి చల్లటి, నీడ ఎక్కువగా ఉండే ప్రదేశాలను ఇష్టపడతాయి. అలాగే ఎలుకలు, కప్పలు, బల్లులు వంటి చిన్న జీవులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు ఆహారం కోసం కూడా వస్తుంటాయి. అందుకే ఇంటి తోటలో కొన్ని రకాల మొక్కలు ఉంటే వాటి వద్ద పాములు కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వెదురు: వెదురు మొక్కలు చాలా దట్టంగా పెరుగుతాయి. వీటి మధ్య చల్లటి నీడ, దాక్కునేందుకు అనువైన ప్రదేశం ఏర్పడుతుంది. ముఖ్యంగా గోడలు, కంచెల పక్కన వెదురు పెంచితే పాములు దాక్కునే అవకాశం పెరుగుతుంది.
పెరివింకిల్, ఐవీ తీగలు: ఇవి బిళ్లగన్నేరు జాతికి చెందిన తీగలు. ఇవి నేలపై దట్టంగా పరుచుకుంటాయి. దీంతో కింద ఏం జరుగుతుందో కనిపించదు. ఆకులు, తేమ ఎక్కువగా ఉండటంతో పాములకు ఇవి అనువైన ఆశ్రయంగా మారుతాయి.
నిమ్మ గడ్డి: ఈ మొక్కలు గుబురుగా పెరిగి అడుగు భాగంలో ఖాళీ ప్రదేశాన్ని ఏర్పరుస్తాయి. చల్లటి నీడ కారణంగా పాములు విశ్రాంతి తీసుకునేందుకు ఇవి అనుకూలంగా ఉంటాయి.
మల్లె మొక్కలు: మల్లె పొదలు దట్టంగా పెరుగుతాయి. వీటి వద్ద ఎలుకలు, కీటకాలు, చిన్న జీవులు ఎక్కువగా సంచరిస్తాయి. వాటి కోసం పాములు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది.
గంధపు చెట్లు: గుబురుగా పెరిగే గంధపు చెట్ల కింద తేమ, నీడ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పాములు అక్కడ దాక్కునేందుకు వీలవుతుంది.
అయితే ఈ మొక్కలు ఉంటే తప్పనిసరిగా పాములు వస్తాయని కాదు. తోటను శుభ్రంగా ఉంచడం, ఎండిన ఆకులు, చెత్త పేరుకుపోకుండా చూడటం, పొదలను ఎప్పటికప్పుడు కత్తిరించడం ద్వారా పాములు వచ్చే అవకాశాన్ని చాలా వరకు తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.